Page Loader
Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు
టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు

Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2024
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL)లోని 2263 మంది ఉద్యోగులకు ఆదివారం ఏకకాలంలో పదోన్నతులు లభించాయి. ఈ మేరకు కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేశారు. కంపెనీ యాజమాన్యం జూనియర్‌ లైన్‌మెన్‌ నుంచి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ర్యాంక్‌ అధికారుల వరకు ప్రమోషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 16 మంది పి అండ్​ జి(P&G) ఆఫీసర్లు కాగా, 47 మంది అకౌంట్స్​నుండి, 2099 మంది ఉద్యోగులు ఆపరేషన్స్​ అండ్​ మెయిన్​టెనెన్స్(O&M)​ నుండి ఉన్నారు.

వివరాలు 

ఇద్దరు సూపరింటెండెంట్ ఇంజనీర్లు (SE) చీఫ్ ఇంజనీర్లుగా  పదోన్నతి 

సమాచారం ప్రకారం, ఇద్దరు సూపరింటెండెంట్ ఇంజనీర్లు (SE) చీఫ్ ఇంజనీర్లుగా, ఒక జనరల్ మేనేజర్ జాయింట్ సెక్రటరీగా పదోన్నతి పొందారు. 8 మంది డివిజనల్ ఇంజనీర్లకు (డీఈ) ఎస్‌ఈలుగా, 30 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లకు డీఈలుగా, 58 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు/అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఏడీఈలుగా, 1650 మంది జూనియర్ లైన్‌మెన్‌లకు అసిస్టెంట్ లైన్‌మెన్‌లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతుల అంశాన్ని ఇటీవల ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి పదోన్నతి ఉత్తర్వులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీని కోరారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు

2017 నుండి ప్రమోషన్ పెండింగ్‌లో ఉంది. చాలా మంది ఉద్యోగులు పదోన్నతులు పొందకుండా పదవీ విరమణ చేశారు. 2263 మంది సిబ్బందికి పదోన్నతుల కారణంగా ఏర్పడిన ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని సీఎండీ తెలిపారు.