
Pahalgam Attack: కాశ్మీర్‌లోని 87 పర్యాటక ప్రదేశాలలో 48 టూరిస్టు ప్రాంతాల మూసివేత.. కేంద్రం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత మంగళవారం చోటుచేసుకున్న ఈ దాడిలో 26మంది టూరిస్టులు దుర్మరణం పొందారు. ఉగ్రవాదులు మతం గురించి విచారణ జరిపి, హిందువులని గుర్తించిన వెంటనే వారికి పైగా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. ఈ దారుణానికి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు బాధ్యత వహించారు. ఈ పరిణామాల మధ్య నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాక, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సింధు జలాల ప్రవాహాన్ని కూడా నిలిపివేసిన విషయం గమనార్హం.
వివరాలు
దాడి జరుగుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్ చెట్టుపైకి ఎక్కి వీడియో
ఈ పరిణామాల నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతానికి చెందిన కొంతమంది మంత్రులు,రాజకీయ నాయకులు భయంకరమైన హెచ్చరికలు చేస్తూ భారత్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు ఉపయోగించాల్సి వస్తుందని,సింధు నదిలో నీరు పోకపోతే భారత రక్తం పారాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు, దాడికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఏఏ) చేతిలో ఉన్నాయని తెలుస్తోంది. ఓ ఫోటోగ్రాఫర్ దాడి జరుగుతున్న సమయంలో చెట్టుపైకి ఎక్కి వీడియో తీశారు, ఆ వీడియో ఇప్పుడు దర్యాప్తులో ప్రధాన ఆధారంగా మారింది. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు ముందస్తు పథకం ప్రకారం దాడి చేశారు. ముందుగానే రెక్కీ నిర్వహించి,టూరిస్టుల మతం తెలుసుకొని,హిందువులని గుర్తించిన వెంటనే కాల్పులు జరిపారు. ప్రధానంగా పురుషులనే లక్ష్యంగా చేసుకుని హత్యలు చేశారు.
వివరాలు
87 టూరిస్టు ప్రాంతాల్లో సమస్యాత్మకంగా మారిన 48 ప్రాంతాలు
ఈ భయానక దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు పూనుకుంది. కశ్మీర్ లోయలో ఉన్న 87 టూరిస్టు ప్రాంతాల్లో సమస్యాత్మకంగా మారిన 48 ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసింది. భద్రతా ఏర్పాట్లు పూర్తి అయిన తరువాతే ఈ ప్రాంతాలను పునః ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెరిచి ఉన్న పర్యాటక ప్రాంతాల్లో భద్రతను గణనీయంగా పెంచినట్టు అధికారులు తెలిపారు. ఇక, సింధు జలాల ప్రవాహం నిలిపివేతపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ తీసుకున్న చర్యల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర సమావేశాలు నిర్వహించింది. ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, దేశంలో నీటి నిర్వహణ పద్ధతులపై సమీక్ష చేపట్టారు.
వివరాలు
కుప్వారా, బారముల్లా జిల్లాల్లోని అక్నూర్ సెక్టార్ వద్ద కాల్పులు
నీటి సమస్యకు తక్షణ పరిష్కారంతో పాటు, భవిష్యత్ వ్యవసాయ అవసరాలను తీర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అదే సమయంలో, ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైన్యం గత నాలుగు రోజులుగా నిరంతరం కాల్పులకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో పాక్ ఆర్మీ వక్రబుద్ధి చూపిస్తూ భారత భద్రతా దళాలను ఉద్దేశించి కాల్పులు జరుపుతోంది. నిన్న అర్థరాత్రి కూడా కుప్వారా, బారముల్లా జిల్లాల్లోని అక్నూర్ సెక్టార్ వద్ద కాల్పులు చేసినట్లు సమాచారం. ఈ దాడులకు భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిస్పందిస్తూ తీవ్రంగా ఎదురు దాడి నిర్వహిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తరచుగా సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని భారత అధికారులు వెల్లడించారు.