
Pakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ అంతర్గతంగా ఆందోళనకు లోనై, భారత్ నుండి వచ్చే ప్రతీకార చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద తన సైనిక దళాలను మోహరించింది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం, పాకిస్తాన్ భారత్‌పై ప్రతికారాత్మక చర్యలకు దిగింది.
భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు, భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తూ, వాణిజ్య సంబంధాలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది.
వివరాలు
భారత పౌరులు సురక్షితంగా ఉండరు
ఈ పరిణామాల మధ్య,పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ, ''భారతదేశం సంపూర్ణ యుద్ధాన్ని చేపట్టే బదులుగా, పాకిస్తాన్ అంతటా విస్తృత స్థాయిలో ఉగ్రదాడులకు సన్నద్ధమవుతోంది'' అని ఆరోపించారు.
భారత్ సంపూర్ణ యుద్ధం మార్గాన్ని విడిచి ఉగ్రవాద చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని,అలాంటి దాడుల విషయంలో తమ దేశం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.అయితే, అలాంటి చర్యలకు ప్రతిక్రియ తప్పదని హెచ్చరించారు.''పాకిస్తాన్ పౌరులకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే ,భారత పౌరులు సురక్షితంగా ఉండరు. భారత్ దాడుల వల్ల ఒక్క పాకిస్తాన్ పౌరుడైన ప్రాణాలు కోల్పోతే, భారతదేశం తీవ్ర మూల్యం చెల్లించాల్సి వస్తుంది'' అని ఖ్వాజా ఆసిఫ్ ఘాటు హెచ్చరిక జారీ చేశారు.
వివరాలు
సింధు జలాల ఒప్పందం రద్దు..''యుద్ధ చర్య'
ఇక పాకిస్తాన్ తన సార్వభౌమాధికారంపై లేదా జాతీయ భద్రతపై ఏవైనా ముప్పులు ఏర్పడితే, తాము తగినంత దృఢమైన ప్రతిస్పందన ఇవ్వకుండా ఉండమని భారత్‌కు హెచ్చరించింది.
పహల్గామ్ వంటి సంఘటనలను భారత ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అంతేకాక, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయాలని భావిస్తే, దానిని ఒక ''యుద్ధ చర్య''గా పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టంచేసింది.