
Pahalgam Terror Attack: సౌదీ పర్యటనను కుదించుకుని దిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో అత్యవసర భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యాటకులపై జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను తక్షణమే ముగించి భారతదేశానికి వెంటనే తిరిగొచ్చారు.
బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ, అక్కడే అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొన్నారు.
వారు ఈ ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను ప్రధానికి సమర్పించారు. దాడి పరిస్థితులు, దాని పరిణామాలు గురించి ప్రధానితో చర్చించారు.
అలాగే, ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా అంశాలపై కేబినెట్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది.
వివరాలు
సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు..
ఇక ఇదిలా ఉంటే,ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌కు చేరుకున్నారు.అక్కడ భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
ఇవాళ ఆయన స్వయంగా దాడి జరిగిన ప్రదేశమైన పహల్గాం ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
కశ్మీర్‌లోని మినీస్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ వద్ద మంగళవారం ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు.
మద్యం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు అక్కడ ఉన్న పర్యాటకుల చుట్టూ చేరి అత్యంత సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈదారుణ ఘటనలో 28మంది ప్రాణాలు కోల్పోగా,పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
దాడి అనంతరం ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోవడంతో,వారిని పట్టుకోవడానికి భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.