
Pahalgam terror plot: పాహల్గాం దాడి కుట్రపై భారత దర్యాప్తు బాంబు.. లాహోర్‌లో హ్యాండ్లర్,పాక్ నుంచే గన్‌మెన్లు!
ఈ వార్తాకథనం ఏంటి
'ఆపరేషన్ మహాదేవ్' అనంతరం పాహల్గాం ఉగ్రదాడిపై భారత భద్రతా దళాలు కీలక ఆధారాలను కనుగొన్నాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్ ఉన్నారని, వారు భారత్‌లోకి ఎక్కడి నుంచి ప్రవేశించారో కూడా గుర్తించారు. జూలై 28న జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన డచ్చిగామ్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ హతమార్చిన సంగతి తెలిసిందే. వీరే పాహల్గాం సమీపంలోని బైసారన్ లోయలో అమాయక ప్రజలపై కాల్పులు జరిపి 26 మందిని హత్య చేసినట్టు అనంతర దర్యాప్తులో తేలింది.
వివరాలు
హతమైన ఉగ్రవాదులు ముగ్గురూ లష్కరే తోయిబాకు చెందినవారే
సీఎన్‌ఎన్ న్యూస్ 18 ఇచ్చిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన లష్కరే తోయిబా దక్షిణ కశ్మీర్ ఆపరేషన్స్ చీఫ్ సాజిద్ సైఫుల్లా జట్ ఈ దాడికి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించాడు. డచ్చిగామ్‌లో హతమైన ముగ్గురి అంత్యక్రియలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరగడం, వాటిని లష్కరే తోయిబా నేత రిజ్వాన్ అనీస్ సమన్వయం చేయడం ఈ కుట్ర వెనుక పాక్ హస్తం స్పష్టంగా ఉన్నట్లు నిర్ధారించింది. డచ్చిగామ్‌లో హతమైన ఉగ్రవాదులు ముగ్గురూ పాకిస్తానీయులేనని, లష్కరే తోయిబాకు చెందినవారేనని భద్రతా శాఖలు ధ్రువీకరించాయి. వారిని సులేమాన్ షా అలియాస్ ఫైజల్ జట్, అబూ హమ్జా అలియాస్ అఫ్గాన్, యాసిర్ అలియాస్ జిబ్రాన్‌లుగా గుర్తించారు.
వివరాలు
పాకిస్థాన్ లింక్‌ను ఎలా గుర్తించారు?
డచ్చిగామ్‌లో హతమైన ఉగ్రవాదుల వద్దనుండి ఓటర్ ఐడీ కార్డులు, నాడ్రా(NADRA)కార్డులు (పాకిస్థాన్‌లో ఆధార్‌కు సమానమైనవి) లభించాయి. ఇవి లాహోర్, గుజ్రాన్వాలా ఓటర్ల జాబితాల్లో ఉన్నవిగా గుర్తించారు. దీంతో వారు పాక్ పౌరులేనని నిర్ధారణ అయింది. అలాగే, డచ్చిగామ్ ప్రాంతంలో వారి వద్ద దొరికిన పాకిస్తాన్ తయారీ చాక్లెట్లు కూడా వారి మూలాలు పాకిస్తాన్‌కి చెందినవేనని స్పష్టంగా చూపించాయి.
వివరాలు
భారతదేశంలోకి వచ్చిన మార్గం ఎలా ఉందంటే?
ఈ ఉగ్రవాదులు గురేజ్ ప్రాంతం వద్ద భారత్‌లోకి ప్రవేశించారని, అనంతరం పాహల్గాం సమీపంలోని ఓ సీజనల్ షెల్టర్‌లో ఆశ్రయం పొందారని భద్రతా వర్గాలు గుర్తించాయి. ఆ ఆశ్రయాన్ని ఇచ్చిన ఇద్దరు కశ్మీరీ వ్యక్తులు.. పర్వేజ్, బషీర్ అహ్మద్ జోథార్.. వారు సహాయం చేసినట్టు అంగీకరించారని నివేదికలో పేర్కొంది. అలాగే, ఒక ఉగ్రవాది వద్ద నుంచి లభించిన గార్మిన్ జీపీఎస్ డివైస్ డేటా, హువావే శాటిలైట్ ఫోన్ కాల్ లాగ్స్ ఆధారంగా వారి ప్రయాణం, పాక్‌లోని ఆపరేషనల్ కంట్రోల్‌తో ఉన్న సంబంధాలు పూర్తిగా బయటపడ్డాయని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి.