
Pak airspace shutdown: పాక్ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో.. భారత విమాన ప్రయాణికులకు ఏమవుతుంది?
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా (టాటా గ్రూప్ ఆధ్వర్యంలో) కీలక ప్రకటన చేసింది.
భారత్‌కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంతో, ఎయిరిండియా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే దిశగా చర్యలు ప్రారంభించింది.
దీనివల్ల విమానాల ప్రయాణ సమయం పెరగనుండగా, వ్యయ భారం కూడా పెరగే అవకాశముందని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తాము
ఎయిరిండియా సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన ప్రకటనలో, ''పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు తాత్కాలికంగా మూసివేసింది. ఫలితంగా ఉత్తర అమెరికా,యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్, పశ్చిమాసియా దేశాలకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే విమానాలు ఇప్పుడు పొడవైన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి వస్తోంది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యానికి మేము బాధపడుతున్నాం. అయితే ఈ గగనతల పరిమితి మన ఆధీనంలో లేని పరిణామం. ఎయిరిండియా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు మేము ప్రాధాన్యత ఇస్తాము'' అని వివరించింది.
వివరాలు
ఇండిగో నుంచి ప్రయాణికులకు ముఖ్య సూచనలు
పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత ప్రభావం తమ నిర్వహణలో ఉన్న కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై పడిందని ఇండిగో సంస్థ ప్రకటించింది.
ఈ ప్రభావం ఎంత తగ్గించవచ్చో అన్న దిశగా తమ సిబ్బంది యథాశక్తి ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేసింది.
ఈ మార్పుల వల్ల ప్రయాణానికి ముందు మీ ఫ్లైట్ స్టేటస్‌ను తనిఖీ చేయాలని, అవసరమైతే రీబుకింగ్ లేదా రిఫండ్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించాలని ప్రయాణికులకు సూచించింది.
దీనికి సంబంధించి 'ఎక్స్' వేదికగా ఒక ట్రావెల్ అడ్వైజరీను కూడా విడుదల చేసింది.
వివరాలు
ఇతర సంస్థలపై కూడా ప్రభావం
ఎయిరిండియా,ఇండిగోతో పాటు, స్పైస్‌జెట్ మరియు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వంటి ఇతర భారతీయ విమానయాన సంస్థలు కూడా అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలపై ఈ గగనతల ఆంక్షల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.
ఈ మార్పులు ప్రయాణికుల అనుభవంపై తాత్కాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.