Page Loader
Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం  
బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం

Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్‌ తాజాగా "చైనా బ్రహ్మపుత్ర నదిని ఆపితే?" అనే అనుమానాన్ని జనాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే, ఈ ప్రచారంలో నిజం ఏమీలేదని గణాంకాలు, వాస్తవాలతో సహా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై ఆయన సామాజిక మాధ్యమం "ఎక్స్"లో ఒక పొడవైన పోస్ట్‌ ద్వారా స్పందించారు.

వివరాలు 

పాకిస్థాన్‌ బూచి కథలకు వాస్తవాలతో గుణపాఠం 

కాలం చెల్లిన సింధూ జలాల పంపిణీ ఒప్పందం నుంచి భారత్‌ బయటపడ్డాక. ఇప్పుడు పాకిస్థాన్ భారత ప్రజలను భయపెట్టే మరో ప్రయోగానికి దిగిందని చెప్పారు. ''బ్రహ్మపుత్ర నదిపై ఆధారపడే భారత్‌కి, చైనా నీటిని ఆపేస్తే ఏమవుతుంది?'' అనే కథనాన్ని వ్యాపింపజేస్తోందన్నారు. ఈ ఊహాజనిత ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ, స్పష్టమైన డేటాతో సమాధానం ఇచ్చారు.

వివరాలు 

బ్రహ్మపుత్ర - భారత్‌కు ప్రధాన వర్షాధార నది 

బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ప్రవేశించిన తర్వాతే విస్తరిస్తుందని బిశ్వశర్మ వివరించారు. చైనా భూభాగం నుంచి వస్తున్న జలాలు మొత్తం నదిలో కేవలం 30-35శాతం మాత్రమేనని,అవి కూడా ఎక్కువగా మంచు కరిగిన నీటితో పాటు టిబెట్‌లో కురిసే పరిమిత వర్షాల వల్ల లభిస్తాయని చెప్పారు. మిగిలిన 65-70శాతం నీరు భారతదేశం నుంచే వస్తోందని వివరించారు.ఈ నీరు ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్‌,అస్సాం,నాగాలాండ్‌,మేఘాలయాలలో కురిసే రుతుపవన వర్షాల ద్వారా ఏర్పడుతోందన్నారు. శుభాంశ్రీ, లోహిత్, కమెంగ్, మానస్, ధన్‌శ్రీ, జియా భరాలి, కోపిలి వంటి ఉపనదులు బ్రహ్మపుత్రకు ప్రధాన జలవాహినులుగా వ్యవహరిస్తాయని వివరించారు. అంతేగాక ఖాసీ, గారో, జయంత పర్వత పరిణాళ్ల నుంచి వచ్చే కుల్సీ, కృష్ణాయ్‌, దిగారు వంటి చిన్న నదులూ బ్రహ్మపుత్రకు జలాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

వివరాలు 

అస్సాంలో ఎక్కువ నీరు రుతుపవనాల వలన 

భారత్‌-చైనా సరిహద్దులో బ్రహ్మపుత్ర ప్రవాహం సెకనుకు సుమారు 2,000-3,000 క్యూబిక్ మీటర్లు ఉండగా, అస్సాంలో రుతుపవనాల సమయంలో ఈ ప్రవాహం సెకనుకు 15,000-20,000 క్యూబిక్ మీటర్లకు పెరుగుతుందన్నారు. దీన్ని బట్టి భారత్‌కు చైనా నుంచి వచ్చే నీటి ప్రవాహం పెద్దగా అవసరం లేదని స్పష్టం చేశారు.

వివరాలు 

బ్రహ్మపుత్రను నియంత్రించలేరు 

బ్రహ్మపుత్ర వర్షాధారిత నది కావడంతో, దాన్ని ఎగువన ఉన్న దేశం నీటిని ఆపి నియంత్రించలేదని స్పష్టం చేశారు. "చైనా నీటిని ఆపితే నష్టం" అనే ప్రచారం తప్పుడు భయం సృష్టించడమేనని హిమంత బిశ్వశర్మ అన్నారు. నిజానికి, నీటిని కొంతవరకైనా ఆపితే అస్సాంలో ప్రతి ఏడూ వచ్చే భారీ వరదలు తగ్గి లక్షల మందికి ఉపశమనం కలుగుతుందన్నది ఆయన వాదన.

వివరాలు 

పాకిస్థాన్‌ అనవసర ఆందోళన 

పాకిస్థాన్‌ గత కొన్ని దశాబ్దాలుగా సింధు ఒప్పందంలో తనకు లభించిన ప్రత్యేక హక్కులను వాడుకొని, ఎక్కువ నీటిని వినియోగించుకుంటోందని అన్నారు. ఇప్పుడు భారత్‌ తనకు న్యాయంగా రావలసిన వాటాను అడుగుతోందని, అందుకే పాక్‌ అసహనం వ్యక్తం చేస్తోందన్నారు. బ్రహ్మపుత్ర నది కేవలం ఒక్క దేశంతో నియంత్రించదగినది కాదని, అది భారతదేశ భౌగోళిక నిర్మాణం, వర్షాలు, రుతుపవనాలతో బలపడుతుందని బిశ్వశర్మ స్పష్టం చేశారు.

వివరాలు 

పాక్‌ ప్రచారానికి మూలం - చైనా ప్రతినిధి వ్యాఖ్యలు 

ఈ ప్రచారానికి కేంద్ర బిందువుగా నిలిచింది చైనా జాతీయ ఆలోచనా వేదిక "సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్" వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయ్ గావ్‌ చేసిన వ్యాఖ్యలు. భారత్‌ సింధు ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో, బ్రహ్మపుత్ర నీటిని చైనా భారత్‌కు పంపకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్‌ మీడియా దీనిని స్వీకరించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది.