
India-Pakistan: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ ఆర్మీ కాల్పులు.. సమర్థంగా ఎదుర్కొంటున్న భారత్
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైన్యం తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
వరుసగా ఆరో రోజు కూడా అదే ధోరణి కొనసాగిస్తూ, తాజాగా ఎల్‌వోసీ (నియంత్రణ రేఖ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని నాలుగు సరిహద్దు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడిందని అధికారులు తెలిపారు.
అయితే శత్రు దాడులకు భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటోందని వారు స్పష్టం చేశారు.
ఏప్రిల్ 29-30 అర్ధరాత్రి సమయంలో, జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పరగ్వాల్ సెక్టార్‌తో పాటు రాజౌరీ జిల్లాలోని సుందర్‌బనీ, నౌషేరా ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడినట్టు సమాచారం.
వివరాలు
ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిలో 26 మంది మృతి
ఇదే సమయంలో బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి ప్రతిరోజూ పాక్ బలగాలు భారత సైన్యంపై కాల్పులు జరుపుతున్నాయని తెలుస్తోంది.
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఈ దాడి అనంతరం భారత్-పాక్ మధ్య వాతావరణం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది.
వివరాలు
భారత్ పాక్‌తో ఉన్న దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు
ఈ నేపథ్యంలో భారత్ పాక్‌తో ఉన్న దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
సింధూ నదుల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన భారత్, పాక్ పౌరులు దేశాన్ని వెంటనే విడిచి వెళ్లాలని ఆదేశించింది.
దీంతో పాక్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ప్రతిస్పందించింది. సిమ్లా ఒప్పందం సహా ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడతామని ప్రకటించింది.
అంతేకాకుండా, తమ గగనతలంలో భారతీయ విమానాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.