
Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
శనివారం ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్‌కు సుదీర్ఘమైన చరిత్ర ఉందని ధ్వజమెత్తారు.
మానవాళికి ముప్పుగా మారిన దేశంగా పాకిస్తాన్‌ను పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికలపై ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించేందుకు 7 ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది.
ఈ బృందాల్లో ఓవైసీ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ బృందాలు వివిధ దేశాల్లో పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాలపై చర్చించనున్నాయి.
పాక్ ఉగ్రవాదంపై ప్రపంచానికి తాను స్పష్టమైన సందేశం ఇవ్వబోతున్నానని ఓవైసీ తెలిపారు.
పీటీఐతో మాట్లాడిన ఆయన, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకుల రక్తపాతం కొనసాగిస్తున్నారని అన్నారు.
Details
జియావుల్ హక్ కాలం నుంచే పాక్ ఉగ్ర ప్రణాళికలు
భారతదేశమే ఈ ఉగ్రవాదానికి అతిపెద్ద బాధిత దేశమని, జియా ఉల్ హక్ కాలం నుంచే ప్రజల ఊచకోత జరుగుతోందని విమర్శించారు.
భారతదేశంలోని 20 కోట్ల ముస్లిములను పరిగణనలోకి తీసుకోకుండా పాకిస్థాన్ తాము మాత్రమే నిజమైన ఇస్లామిక్ దేశమని భావించడాన్ని తప్పుపట్టారు.
దేశాన్ని అస్థిరత వైపు నడిపించడం, మత విభేదాలను రెచ్చగొట్టడం, అభివృద్ధికి అడ్డుకాయడం పాక్ లక్ష్యమని ఓవైసీ ఆరోపించారు.
1947లో స్వాతంత్ర్యం అనంతరం జమ్ముకశ్మీర్‌లోకి గిరిజన ఆక్రమణదారులను పంపినప్పుడు నుంచే పాక్ ఉగ్ర ప్రణాళిక ప్రారంభమైందని గుర్తుచేశారు.
ఇది ఇప్పటికి కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ ఆగబోదని వ్యాఖ్యానించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం ఇక సహించదని స్పష్టం చేశారు.