Loading...
Shanghai Cooperation Organisation: భారత్‌కు పాకిస్థాన్ మంత్రి రాక.. మోదీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
భారత్‌కు పాకిస్థాన్ మంత్రి రాక.. మోదీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

Shanghai Cooperation Organisation: భారత్‌కు పాకిస్థాన్ మంత్రి రాక.. మోదీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశానికి పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడం రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఆయన పర్యటనను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సమయంలో ముసాదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 'మా నీళ్లను ముట్టుకుంటే చేతులు నరికేస్తాం' అంటూ ఆయన హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇప్పుడు భారత్‌లో పర్యటించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ విదేశాంగ విధానం గందరగోళంగా ఉందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఫక్రుల్ హసన్ విమర్శించారు.

వివరాలు 

ప్రధానమంత్రి మోదీ ఒత్తిడిలో పనిచేస్తున్నారు

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పాక్ మంత్రి రాకపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసింది.

ఉగ్రవాదానికి తాము ఎప్పుడూ వ్యతిరేకమని చెప్పే బీజేపీ.. ఇప్పుడు పాకిస్థాన్ మంత్రికి స్వాగతం పలుకుతోందని ఎద్దేవా చేసింది.

విదేశాంగ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం అయోమయంతో వ్యవహరిస్తోందని ఇండియా కూటమి నాయకుడు సురేంద్ర రాజ్‌పూత్ ఆరోపించారు.

'భారత క్రికెటర్లు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆడాలని బీజేపీ కోరుతోంది. అదే సమయంలో పాక్ మంత్రులకు ఆహ్వానం పలుకుతోంది. విదేశాంగ విధానంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పరస్పర విరుద్ధంగా ఉంది. గందరగోళంలో ఉన్న ప్రధానమంత్రి మోదీ ఒత్తిడిలో పనిచేస్తున్నట్టున్నారు' అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలో షాంఘై సహకార సంస్థ సమావేశాలు

కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ సైతం ముసాదిక్ మాలిక్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన వ్యాఖ్యలు ఉగ్రవాదులు చేసే హెచ్చరికలకు ఏమాత్రం తీసిపోవని మండిపడ్డారు.

అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి భారత్‌కు రావడంపై కేంద్రం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా, నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాలు జరగనున్నాయి.

ఈ భేటీలో భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, బెలారస్ దేశాలు పాల్గొననున్నాయి.

ఈ సమావేశాల నేపథ్యంలో పాక్ మంత్రి భారత్‌కు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT