Page Loader
Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు!
మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు!

Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు భారీ నష్టం కలిగించింది. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు, ప్రాథమికంగా ప్రకటించిన టార్గెట్ల కంటే ఎనిమిది అదనపు ప్రదేశాలపై కూడా దాడులు జరిపినట్లు పాక్ ప్రభుత్వ పత్రాల ద్వారా వెల్లడైంది. అవి పేషావర్, జహంగ్, సింధ్ రాష్ట్రంలోని హైదరాబాద్, పంజాబ్‌లోని గుజరాత్, గుజ్రాన్‌వాలా, భవల్‌నగర్, అటాక్, చోర్ నగరాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు. ఈ ప్రాంతాలపై దాడులు జరిగిన విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా లీకైన పాకిస్థాన్ డాక్యుమెంట్లు భారత దళాలు పాక్ లోతుల్లోకి వెళ్లి విధ్వంసకాండ జరిపినట్లు వెల్లడిస్తున్నాయి.

వివరాలు 

పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ సెంటర్లపై భారీ దాడులు

భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (DGMO) చేసిన మీడియా సమావేశాల్లో ఈ అదనపు ప్రదేశాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆపరేషన్ మే 7న ప్రారంభమైన తర్వాత నాలుగు రోజుల పాటు భారత-పాక్ సైన్యాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడులను జీర్ణించుకోలేని పాక్,ప్రతీకారంగా భారత్ సరిహద్దులోని సైనిక స్థావరాలు,పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉండి వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాక్ పంపిన డ్రోన్లు,క్షిపణులు,యుద్ధ విమానాలను భారత దళాలు కూల్చివేశాయి. అంతేకాకుండా పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ సెంటర్లపై భారీ దాడులు జరిపింది. పాకిస్థాన్ సొంత ప్రభుత్వ పత్రాల ప్రకారమే భారత్ జరిపిన దాడులతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నది స్పష్టమైంది.

వివరాలు 

వెనక్కి తగ్గిన పాక్

ఈ నష్టాల వల్లే పాకిస్థాన్ వెనక్కి తగ్గి,కాల్పులు విరమణ ఒప్పందం ప్రతిపాదించేందుకు ముందుకొచ్చింది. మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లోనూ భారత్‌ దాడులతో పాక్ వనరుల ఎంత మొత్తంలో ధ్వంసమయ్యాయో వివరంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం బహావల్పూర్‌లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం,మురీద్కేలోని లష్కరే తొయిబా శిక్షణ శిబిరం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్, కొట్లి, రావల్‌కోట్, చక్స్వారి, భింబర్, నీలం లోయ, జహ్లమ్, చక్వాల్ వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది.

వివరాలు 

రాడార్ కేంద్రాలు పూర్తిగా నాశనం

మే 7 తెల్లవారుజామున ఆపరేషన్ ప్రారంభమై, పాక్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఆపై పాక్‌కు చెందిన పదకొండు విమాన స్థావరాలపై కూడా దాడులు జరిపింది. అవి: నూరు ఖాన్, రఫీక్వి, మురీద్, సుక్కర్, సియాల్‌కోట్, పస్రూర్, చూనియాన్, సర్గోదా, స్కర్దూ, భోలారి, జాకొబాబాద్. ఈ విమాన స్థావరాలు, వాటి వద్ద ఉన్న రాడార్ కేంద్రాలు పూర్తిగా నాశనం అయ్యాయి. మొత్తం మీద పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాక్‌కు దిమ్మతిరిగేలా చేసింది.