
Pak-India: ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ ఆర్మీ
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కాశ్మీర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
ఈ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని కలచివేసిన నేపథ్యంలో, నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
వరుసగా రెండో రోజూ పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది.
శనివారం కూడా పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించగా, అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా స్పందించి కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఓ అధికారిక ప్రకటనలో భారత ఆర్మీ పేర్కొంది.
ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం వాటిల్లలేదని తెలిపారు.
Details
పాక్ పై భారత్ కఠిన అంక్షలు
ఇక పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి భారత్ పాక్‌పై ఇప్పటికే పలు కఠిన చర్యలకు తెరతీసింది.
ఉగ్రవాదులపై ప్రతీకార చర్యలుగా సింధు నదులపై జలాల పంపిణీని నిలిపివేయడం, పాకిస్థాన్‌కు జారీ చేసిన వీసాలను రద్దు చేయడం, అటారీ సరిహద్దును మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది.
ఒక్కొక్కటిగా శిక్షలు విధిస్తూ భారత్ ముందుకు సాగుతోంది. అంతేకాక ఉగ్రవాదులకు ఊహించని విధంగా తగిన శిక్షలు విధిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు.
ఈ నేపథ్యలో పాక్‌పై మరింత గట్టి చర్యలు తీసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. పహల్గామ్‌లో జరిగిన దారుణ దాడిలో పదుల కొద్దీ పర్యాటకులు గాయపడగా, ఈ ఘటన వల్ల భారత్-పాక్ మధ్య సంబంధాలు మరోసారి తీవ్రంగా దెబ్బతిన్నాయి.