రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య వాగ్యుద్ధం; వీడియో వైరల్
అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్ల నిరసనపై తదుపరి కార్యచరణను చర్చించడానికి హర్యానాలో శుక్రవారం సమావేశమైన "ఖాప్ పంచాయితీ" సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. వాగ్యుద్ధం జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరవడం, ఒకరికొకరు వేళ్లు చూపడం ఆ వీడియోలో కనపడుతుంది. అయితే గొడవకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రెజ్లర్ల తరపున ప్రణాళికలను రూపొందించడానికి రైతులు, ఖాప్ నాయకులతో సహా 31 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయగా, క్రీడలకు సంబంధించిన నిర్ణయాలపై వారికి మార్గనిర్దేశం చేసేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
రెజ్లర్ల ఆరోపణలను ఖండించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మైనర్‌తో సహా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆరోపించారు. ఈ మేరకు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాతో సహా పలువురు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్న స్టార్లు రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు. అయితే తనపై వచ్చిన అన్ని లైంగిక వేధింపుల ఆరోపణలను ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజమని రుజువైతే తాను ఉరివేసుకుంటానని ప్రకటించారు.