Same-Sex Marriage: స్వలింగ వివాహానికి చట్టబద్ధత ఇవ్వలేమని చెప్పిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి కీలక ఆదేశాలు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపును ఇవ్వడానికి సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహా కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కుల కోసం చట్టాలు చేయాల్సిన బాధ్యత పార్లమెంటుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ భాగస్వాములను ఎన్నుకునే స్వలింగ సంపర్కులకు ఉంటుందని నొక్కి చెప్పింది. అయితే స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష చూపకుండా కేంద్రం చూసుకోవాలని సూచించింది. రిషన్ కార్డులు, పెన్షన్ల విషయంలో స్వలింగ సంపర్కుల హక్కులు, అర్హతలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
స్వలింగ సంపర్కం అనేది మానసిక రుగ్మత కాదు: సుప్రీంకోర్టు
స్వలింగ సంపర్కుల హక్కుల గురించి ప్రజలను చైతన్యపరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సీజేఐ ఆదేశించారు. స్వలింగ సంపర్కం అనేది మానసిక రుగ్మత కాదన్నారు. స్వలింగ కమ్యూనిటీ కోసం హాట్‌లైన్‌ను ప్రారంభించాలని, వేధింపులను ఎదుర్కొంటున్న వారి కోసం "గరిమా గృహ్" సురక్షిత గృహాలను ప్రారంభించాలని సూచించారు. ఈ క్రమంలో స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధంగా గుర్తంచకుండా, వారి సమస్యలను పరిష్కరించాడానికి అవసరమయ్యే సూచనల కోసం క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం, 1955హిందూ వివాహ చట్టం, విదేశీ నిబంధనలను సవాలు చేస్తూ వివిధ స్వలింగ జంటలు దాఖలు చేసిన 20 పిటిషన్లను విచారించిన రాజ్యాంగ దర్మానసం మంగళవారం తుది తీర్పును వెలువరించింది.