PM Modi: పార్లమెంట్ పాత భవనం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం: వీడ్కోలు పలికిన ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మొదటి రోజున లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. 75ఏళ్ల దేశ పార్లమెంటరీ ప్రయాణాన్ని గుర్తుచేసుకోవడానికి ఇదొక అవకాశం అని మోదీ అన్నారు. కొత్త సభకు వెళ్లే ముందు ఆ స్ఫూర్తిదాయక క్షణాలను గుర్తుచేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఈ చారిత్రాత్మక భవనానికి మనందరం వీడ్కోలు పలుకుతున్నామని పేర్కొన్నారు. పాత భవనం స్ఫూర్తిదాయకమని, ఇది భారతదేశ బంగారు చరిత్రలో ఒక కీలక ఘట్టం అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఈ పార్లమెంట్ భవనం ఇంపీరియల్ హౌస్ అని పిలిచేవారని మోదీ చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత అది పార్లమెంటుగా మారిందని అన్నారు. ఈ భవనాన్ని విదేశీ పాలకులు నిర్మించినా.. భారతీయుల చెమట, కష్టార్జితాన్ని వారి పెట్టుబడిగా పెట్టారని మోదీ అన్నారు.
ఈ భవనంలో 75ఏళ్లలో ఎన్నో చారిత్రిక నిర్ణయాలు: మోదీ
కొత్త పార్లమెంట్ భవనానికి మారుతున్నప్పటికీ పాత భవనం కూడా రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్య స్వర్ణ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన అధ్యాయమని అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా భారత్‌పై సర్వత్రా చర్చ జరుగుతోందని, ఇది 75 ఏళ్ల సమిష్టి కృషి ఫలితమని ప్రధాని మోదీ అన్నారు. అందరం ఇప్పుడు కొంత సంతోషం, బాధాకరమైన క్షణాలను అనుభవిస్తున్నామని మోదీ అన్నారు. ఈ 75 ఏళ్లలో స్వతంత్ర భారత పునర్నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక ఘట్టాలు, ఈ సభలోనే రూపుదిద్దుకోవడం చూశామని అన్నారు.
ప్రజాస్వామ్య శక్తి వల్లే టీ అమ్ముకునే నేను పార్లమెంట్ వచ్చా: మోదీ
తాను తొలిసారిగా ఈ పార్లమెంట్ భవనానికి వచ్చినప్పుడు సహజంగానే తల వంచి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో అడుగుపెట్టానని చెప్పారు. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై చాయ్ అమ్ముకుని జీవనం సాగిస్తున్న పేదవాడి కొడుకు పార్లమెంటుకు చేరుకోవడం ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి అన్నారు. దేశం తనను ఇంతగా ప్రేమిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. కాలానుగుణంగా సభ కూర్పు కూడా మారుతోందని, అందరినీ కలుపుకుపోతోందని ప్రధాని మోదీ అన్నారు. సభలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని అన్నారు. మొదట్లో మహిళల సంఖ్య తక్కువగా ఉండేదని, కానీ క్రమంగా వారి సంఖ్య పెరిగినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఉభయ సభల్లో 7,500 మందికి పైగా ప్రజాప్రతినిధులు తమ సేవలను అందించారన్నారు.
జీ-20 విజయం ఏ పార్టీది కాదు.. దేశానిది: మోదీ
చంద్రయాన్-3 విజయంతో ప్రపంచం ఆశ్చర్యానికి గురైందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీతో ముడిపడి ఉన్న భారత్ తన కొత్త రూపాన్ని ఆవిష్కరించిందన్నారు. ఇది ప్రపంచంపై పెను ప్రభావం చూపబోతోందన్నారు. ఈ సభ ద్వారా దేశ శాస్త్రవేత్తలకు మరోసారి మోదీ తన అభినందనలు తెలియజేశారు. జీ-20 విజయం యావత్ దేశం సాధించిన విజయమని మోదీ అన్నారు. ఇది ఏ వ్యక్తి లేదా పార్టీ విజయం కాదని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచ మిత్రదేశంగా తన స్థానాన్ని సంపాదించుకోగలిగిందని మోదీ అన్నారు. ఇది మనందరికీ గర్వకారణం అని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశంలో తన స్నేహితుడిని చూస్తోందన్నారు. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' మంత్రం ప్రపంచాన్ని ఒకచోట చేర్చడంలో సాయపడుతోందన్నారు.
ఆర్టికల్ 370, జీఎస్టీ, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఆమోదించింది ఈ పార్లమెంట్‌లోనే: మోదీ
ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ వంటి ప్రతిష్ఠాత్మక బిల్లులు ఈ పార్లమెంట్ భవనంలోనే ఆమోదించినట్లు మోదీ అన్నారు. ఈ సభ సాక్షిగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆశలు, విశ్వాసాలతో ఎంపీలు కొత్త భవనంలోకి ఎంపీలు ప్రవేశిస్తారని తాను ఆశిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ పార్లమెంటులో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన ప్రసంగాలు తమకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. 2001లో జరిగిన ఉగ్రదాడిని కూడా ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రస్తావించారు. ఇది ప్రజాస్వామ్య మాతపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. ఆ దాడిని దేశం ఎప్పటికీ మరిచిపోదని ప్రధాని మోదీ అన్నారు.