
Jagdeep Dhankhar: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదన్న ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ వ్యాఖ్యలు ఇటీవల తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయన మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సంబంధిత విషయాలలో ఎన్నికై వచ్చిన ప్రజాప్రతినిధులే 'చివరి అధికారం కలిగిన వారు' అంటూ ధన్‌ఖడ్ అన్నారు.
మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
రాజ్యాంగ సంబంధిత అంశాలలో ప్రజాప్రతినిధులే తుది నిర్ణయం
"ప్రజలచే ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతగలవారిగా ఉండాలి. ప్రధానమంత్రి అయినా సరే, ఎమర్జెన్సీ విధించినప్పటికీ ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యానికి ఉంది. రాజ్యాంగ సంబంధిత అంశాలలో ప్రజాప్రతినిధులే తుది నిర్ణయం తీసుకునే అధికారులుగా ఉండాలి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా పార్లమెంట్ కంటే గొప్పదేది ఉందని పేర్కొనలేదు. పార్లమెంటే అత్యున్నతమైనది" అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని కూడా ప్రస్తావించారు.
ఆ సమయంలో పౌరుల ప్రాథమిక హక్కులు తీవ్రంగా హరించబడ్డాయని గుర్తుచేశారు.
వివరాలు
చట్టాలు రూపొందించగలిగే న్యాయమూర్తులు మన వద్ద ఉన్నారు
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో,రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి నిర్దిష్ట కాల వ్యవధిలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పుపై స్పందించిన ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. "రాష్ట్రపతికి గడువు విధించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై అణచివేత చూపించేలా సుప్రీంకోర్టు వ్యవహరించకూడదు. ఇప్పుడు చూస్తుంటే - చట్టాలు రూపొందించగలిగే న్యాయమూర్తులు మన వద్ద ఉన్నారు! అంతేకాక, కార్యనిర్వాహక బాధ్యతలు కూడా వారు తీసుకుంటున్నారు. వారంతా ఒక 'సూపర్ పార్లమెంట్'లా మారిపోతున్నారు. కానీ, వారిపై మాత్రం ఎలాంటి బాధ్యత ఉండదు. ఎందుకంటే, దేశ చట్టాలు వారికి వర్తించవు" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
బీజేపీ నేతల వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు
ఈ అంశంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి.
"ఒకవేళ సుప్రీంకోర్టే చట్టాలు చేయాల్సి వస్తే, పార్లమెంట్ భవనాన్ని మూసివేయడమే సరైన పని" అని ఆయన అన్నారు.
అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.