Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు
దిల్లీ నుంచి బిహార్‌లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ వద్ద బాద్సా ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్ వెంటనే అప్రమత్తమై, బస్సు ఆపి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన హత్రాస్ జిల్లా సదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిధావలి గ్రామం సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగింది.
ప్రమాదం ఎలా జరిగింది?
దిల్లీలోని వజీరాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బీహార్‌లోని సుపాల్‌కు బయలుదేరిన ఈ బస్సులో ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణమధ్యలో బస్సు పైకప్పుపై ఉంచిన లగేజీ నుంచి మంటలు చెలరేగాయి. ఊహించని ఈ మంటలు చూసి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే బస్సును ఆపి బస్సు నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అధికారుల స్పందన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సుదూర ప్రయాణాల్లో భద్రతపై ప్రశ్నలు
ఈ ఘటన సుదూర ప్రయాణాల్లో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఏ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోలేదు. కానీ, సకాలంలో సహాయక చర్యలు చేపట్టకుంటే పరిస్థితి విభిన్నంగా ఉండేది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు.