Gram Sabha:13,326 పంచాయతీల్లో గ్రామసభలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
9 కోట్ల పనిదినాలతో 13,326 పంచాయతీల్లోని 87 ప్రాజెక్టుల పరిధిలో 57 లక్షల మందికి పనులు కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 4500 కోట్ల నిధులతో నరేగా పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వికేంద్రీకృత పాలనకు పునాది అయిన పంచాయితీ రాజ్ వ్యవస్థను భారతదేశంలో అమలు చేస్తున్న రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో కొత్త దశకు గుర్తుగా రెండో తరం సంస్కరణల్లో భాగంగా రానున్న కార్యక్రమాలను వివరించారు.
ప్రాజెక్టుల పూర్తికి నరేగా నిధుల వినియోగం
స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పంచాయతీ నిధుల నుంచి రూ. 240కోట్లు వివిధ ప్రాజెక్టులకు కేటాయిస్తామని తెలిపారు. జాతీయ ఉపాధిహామీ పథకంలో గత ప్రభుత్వం రూ.40,578కోట్లు ఖర్చు చేసిందని నివేదిస్తున్నారని.. కానీ దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనపడటం లేదన్నారు. పంచాయతీలను బలోపేతం చేయటం తమ ప్రభుత్వ లక్ష్యం అని దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పంచాయితీలు కీలకంగా మరాలనేది తన ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇంకా,87 ప్రాజెక్టుల పూర్తికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(NREGA)నిధులను కూడా వినియోగిస్తామని ఆయన ప్రకటించారు. కొన్ని పంచాయతీలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడకు విజిటింగ్ కోసం అందరూ వచ్చేలా చేద్దామని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి చర్యలు
కొన్ని పంచాయితీలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంటాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. అరకు కాఫీ, లేపాక్షి, చేనేత, గ్రానైట్ వంటి వాటి వల్ల ఆయా పంచాయితీలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నా ఆయన యువత, మహిళలు గ్రామ సభల్లో పాల్గొనాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఎలా తరలి వచ్చారో గ్రామ సభలకు కూడా అలానే రావాలి అని కోరుతున్నాన్నారు. పంచాయితీలకు చెందిన చాలా భూమి అనేక చోట్ల నిరుపయోగంగా ఉన్నాయని గ్రామాల్లోకి రాగానే చెత్తా చెదారం కనపడుతోందన్నారు. గ్రామాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు.