
వారాహి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్.. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ కు విశ్రాంతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్రతో పొలిటికల్ హీట్ పెంచుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు.
ఈ మేరకు పవన్ జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత కొద్ది రోజులుగా పవన్ వారాహి నవరాత్రుల ఉపవాస దీక్ష చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన జ్వరంతో మరింత నీరసించిపోయారని వివరించాయి. అందువల్లే వారాహి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశామని స్పష్టం చేశాయి.
గత రాత్రి నరసాపురంలో సభ నిర్వహించిన పవన్ కల్యాణ్, తర్వాత పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చేరుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
DETAILS
ఈ నెల 30న భీమవరంలో జనసేనాని భారీ బహిరంగ సభ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే ఈ నెల 30న జనసేనాని భారీ బహిరంగ సభను ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పవన్ అనారోగ్యం కారణంగా ఇవాళ భీమవరం నియోజకవర్గ జనసేన నాయకులతో జరగాల్సిన భేటీని నిర్వహించలేదు.
తొలుత మధ్యాహ్నం సమావేశం నిర్వహించే అవకాశాలుండగా, పవన్ కు మరింత విశ్రాంతి కావాల్సిన నేపథ్యంలో భేటీ వాయిదా పడింది.
ఈ నెల 14 నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను ప్రారంభించారు. యాత్ర తొలి విడతలో భాగంగా జిల్లాలోని దాదాపు 11 నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్న విషయం తెలిసిందే.
గత కొద్దిరోజులుగా అవిశ్రాంతంగా యాత్ర చేపట్టడం ద్వారా జనసేనాని స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. త్వరలోనే యాత్రను కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.