సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య
సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యయి. అలాగే అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్ట్ సంచలనంగా మారింది. దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అయితే ఈ రెండు వ్యవహారాలపై కాంగ్రెస్ మిత్రపక్షంలో కీలక నేత, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిండెన్‌బర్గ్ విశ్వసనీయతపై ప్రశ్నించడంపై శరద్ పవార్ మాట్లాడుతూ, హిండెన్‌బర్గ్ రిపోర్టు అదానీ గ్రూప్‌ని టార్గెట్ చేసినట్లుగా ఉందని స్పష్టం చేశారు. ఎవరో ఒక ప్రకటన ఇచ్చారని, అది దేశంలో అలజడి సృష్టించిందన్నారు. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైనట్లు చెప్పారు. ఈ రిపోర్టు ఎవరు ఇచ్చారనేది ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వాటిని విస్మరించలేమన్నారు.
అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ అనవసరం
అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై కూడా పవార్స్పందించారు. అధికార పార్టీపై విచారణ జరిపే జేపీసీ కమిటీలో అధికార పక్షానికి చెందిన మెజారిటీ సభ్యులు ఉంటారని, ఇలా ఉండటం వల్ల నిజం ఎలా బయటకు వస్తుందని పవార్ అన్నారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ జరిపితే నిజం బయటకు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. అందుకే ప్రత్యేకంగా జేపీసీ విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో సావర్కర్ గౌరవనీయమైన వ్యక్తి కాబట్టి ఆయనపై మాటల దాడిని రాహుల్ తగ్గించుకోవాలని కాంగ్రెస్‌కు పవార్ సలహా ఇచ్చారు. ఇటీవల 'నేను సావర్కర్ కాదు' అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే కూడా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.