Sankranti Rush: స్వగ్రామాల బాట పట్టిన ప్రజలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఒక్కసారిగా పెరిగిన రద్దీ
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వేకువజాము నుంచే వాహనాల రాక పెరగడంతో ట్రాఫిక్ ఒక్కసారిగా అధికమైంది. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో అధికారులు ఎక్కువ టోల్ బూత్‌లను తెరిచి వసూళ్లు చేపట్టారు. కార్లు సహా ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సుమారు 70 వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లినట్లు పంతంగి టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపారు.
Details
నందిగామ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ స్కానింగ్‌ను వేగంగా పూర్తి చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వై జంక్షన్ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.