Andhra Pradesh: ఏపీలో 28.62 లక్షల కుటుంబాలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత కుల ధృవీకరణ పత్రాలపై కూటమి ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చిందని మంత్రి అనగాని వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 28.62 లక్షల కుటుంబాలకు రెవెన్యూ యంత్రాంగం ద్వారా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను అందజేశారు. 34.37 లక్షల కుటుంబాల డేటాను అధికారులు విశ్లేషించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు మంత్రి అనగాని తెలిపారు.
వీఆర్వోలు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు.
కుల ధృవీకరణ పత్రాలు స్కూళ్లు, కాలేజీల్లో ప్రవేశాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు, ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.
గతంలో శాశ్వత కుల ధృవీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చిందన్నారు.
Details
క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పత్రాలు పంపిణీ
అయితే ఇప్పుడు అర్హులైన వారికి సుమోటోగా విచారణ జరిపి పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు.
ఇకపై కుల ధృవీకరణ కోసం ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, గ్రామ, వార్డు సచివాలయాలు లేదా ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
దరఖాస్తు వచ్చిన వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడికక్కడే ధృవీకరణ పత్రాలను అందజేస్తారని తెలిపారు.
Details
పట్టణాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతరావు అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు.
అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాలను ప్రభుత్వమే అందజేస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 70,232 దరఖాస్తులందినట్లు పేర్కొన్నారు.
మునుపటి ప్రభుత్వంతో పోల్చితే తాము పేదలకు ఎక్కువ స్థలం కేటాయిస్తున్నామని, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామని వెల్లడించారు.
Details
జగనన్న ఇళ్ల పథకంలో భారీ కుంభకోణం
జగనన్న ఇళ్ల పథకం కుంభకోణంగా మారిందని మంత్రి ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
ఇళ్ల పట్టాల కోసం భూముల కొనుగోలులో వైసీపీ నేతలు భారీ అవకతవకలకు పాల్పడ్డారని, నివాసయోగ్యం కాని భూములను అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించారని పేర్కొన్నారు.
మొత్తం రూ. 10,500 కోట్లతో 26,000 ఎకరాల ప్రైవేట్ భూములు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతల ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం నిజమైన పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతో అందరికీ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.