LOADING...
Coldrif Cough Syrup: కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. చెన్నైలో కంపెనీ యజమాని అరెస్ట్..
కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. చెన్నైలో కంపెనీ యజమాని అరెస్ట్..

Coldrif Cough Syrup: కోల్డ్‌రిఫ్ కేసులో కీలక పరిణామం.. చెన్నైలో కంపెనీ యజమాని అరెస్ట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందు కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. కోల్డ్‌రిఫ్ దగ్గు మందును తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్‌ను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఈ ఉదయం చెన్నైలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాల ప్రకారం, శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్‌రిఫ్ దగ్గు మందును తాగిన తర్వాత, కేవలం మధ్యప్రదేశ్‌లోనే 20కు పైగా చిన్న పిల్లలు మృతి చెందారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు రంగనాథన్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ అరెస్ట్ గురువారం జరిగిందని వెల్లడించారు.

వివరాలు 

అన్ని రాష్ట్రాలు కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వినియోగాన్ని నిషేధించాయి

అదే సమయంలో, రాజస్థాన్ రాష్ట్రంలోనూ కోల్డ్‌రిఫ్ దగ్గు మందు తాగిన కారణంగా చాలామంది చిన్న పిల్లలు మరణించారని ఆరోపణలు ఉన్నాయి. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లలు కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని బట్టి, దేశంలోని అన్ని రాష్ట్రాలు కోల్డ్‌రిఫ్ దగ్గు మందు వినియోగాన్ని నిషేధించాయి. ఈ మందును చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు వంటి లక్షణాలను నివారించేందుకు వాడతారు. అయితే, ఈ మందుపై వచ్చే ఆరోపణల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం దాన్ని సాంపిల్ గా సేకరించి పరీక్షించించింది. ఫలితంగా, ల్యాబ్ రిపోర్ట్‌లు ఆ మందు ప్రమాదకరమైనదని నిర్ధారించాయి.

వివరాలు 

 ఈ రసాయన పదార్థం కారణంగా చాలా మంది మృతి 

ఆ దగ్గు మందులో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరితమైన ఇండస్ట్రియల్ రసాయన పదార్థం ఉన్నట్లు తేలింది. ఈ రసాయన పదార్థాన్ని మనుషులు వాడకూడదు. డైథిలిన్ గ్లైకాల్ ఉన్న మందుల్ని తీసుకోవటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, ప్రాణనష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా ఈ రసాయన పదార్థం కారణంగా చాలా మంది చనిపోయినట్లు సమాచారం. అంతేకాక, పలు దేశాలు మెడిసిన్స్‌లో డైథిలిన్ గ్లైకాల్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాయి. అయినప్పటికీ, కొన్నిసార్లు కొన్ని కంపెనీలు వ్యయాన్ని తగ్గించడానికి ఈ విషపూరిత రసాయనాన్ని ఉపయోగించటం కొనసాగిస్తున్నాయి.