Elections 2024: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్ .. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతుండగా.. 10రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈక్రమంలోనే ఉదయం నుండే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూ లైన్లలో నిలుచుంటున్నారు. ఎండ వస్తే తట్టుకోలేమని భావించిన ఓటర్లు..ఉదయం 7గంటల లోపే పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లో పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి వచ్చి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసిన ప్రముఖులు వీరే..
హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థి మాధవీలత,ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. మెగాస్టార్ చిరంజీవి,అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్,మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్,ఆయన భార్య నారా బ్రాహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్ బూత్‌లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.