PM Modi: వైరల్‌గా మారిన ప్రధాని మోదీ భద్రతలో మహిళా కమాండో ఫొటో.. అసలు విషయం ఏంటంటే..?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతలో మహిళా కమాండోలు ఉన్నారా? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. బీజేపీ ఎంపీ,బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న ఒక ఫొటో దీనికి కారణమైంది. ఆ ఫొటోలో, పార్లమెంట్ వద్ద నడుస్తున్న ప్రధాని వెనుక ఒక మహిళా భద్రతా సిబ్బంది కనిపించారు. ఈ ఫొటో కంగనా షేర్ చేయడంతో, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోకు కంగనా ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, ఆ మహిళ ప్రధాని భద్రతా బృందమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)లో సభ్యురాలే అయి ఉండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రపతికి కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి
ఇది ప్రధానమంత్రి భద్రతలో మహిళా కమాండోలు ఉన్నారనే చర్చకు దారితీసింది. దీనిపై భద్రతా వర్గాలు స్పందిస్తూ, కొన్ని మహిళా ఎస్‌పీజీ కమాండోలు 'క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్'లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించాయి. అయితే, ఆ ఫోటోలో కనిపించిన మహిళ ఎస్‌పీజీ బృందంలో భాగమని అనుకోవడం తప్పు అని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేటాయించిన వ్యక్తిగత భద్రతా అధికారి అని స్పష్టంగా తెలియజేశాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న ఈ అధికారి పేరు లేదా ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.