AP Ponds : రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు. అన్ని చెరువులను నీటితో నింపాలని ఆదేశాలను జారీ చేస్తూ జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేశారు. తాజాగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, చిన్న నీటి వనరుల విభాగం అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఏం చేస్తే చెరువులను నింపొచ్చొ, వాటికి అనుగుణంగా ప్రణాళికలు చేయాలన్నారు. ముఖ్యంగా సాగు, తాగునీటిని అందుబాటులో ఎలా తేవాలో అనే దానిపై అధికారులతో చర్చించారు. నదులు, రిజర్వాయర్లను జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 38,445 చిన్న చెరువులు
రాష్ట్రవ్యాప్తంగా 38,445 చిన్న చెరువులు ఉన్నాయి. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 206.22 టీఎంసీలుగా ఉంది. ఈ చెరువుల కింద 25.60 లక్షల ఎకరాలు సాగయ్యే ఆయకట్టు ఉంది. ఈ ఏడాది ఓ మోస్తరు వర్షాలు కురిసినా ఈ చెరువులన్నీ పూర్తిగా నిండలేదు. మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది 37.12 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో చెరువులన్నీ నింపితే సమీపంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. చెరువుకు సమీపంలో 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ప్రధాన కాల్వలను గుర్తించి, అక్కడి నుంచి చెరువు వరకు పిల్ల కాలువలు తవ్వాలన్నారు.