
Pm Modi: ట్రంప్ నాలుగుసార్లు ఫోన్ చేసినా పలకని ప్రధాని మోదీ.. జర్మనీ వార్తాపత్రిక 'ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమేని' కథనం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడడానికి అనేకసార్లు ప్రయత్నించారని జర్మనీ వార్తాపత్రిక 'ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమేని'ప్రచురణలు వెలువడ్డాయి. ఈ ప్రయత్నాలను మోదీ తిరస్కరించారని,ట్రంప్‌కి సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని పత్రిక వివరించింది. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం విధించిన 50శాతం టారిఫ్‌ల కారణంగా భారత నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని,ఈ ఫోన్‌ల విఫల ప్రయత్నాలు ఆ అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయని జర్మనీ పత్రిక పేర్కొంది. అదే విషయాన్ని బెర్లిన్‌లోని గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ థార్‌స్టెన్ బెన్నర్ 'ఎక్స్' ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. పత్రిక వివరాలను ఆధారంగా,ట్రంప్ కనీసం నాలుగుసార్లు మోదీతో మాట్లాడేందుకు ఫోన్ చేశారు,కానీ మోదీ స్పందించలేదని,అమెరికా విజ్ఞప్తులను గట్టి తిరస్కరణతో ఎదుర్కొన్నారని పేర్కొంది.
వివరాలు
ట్రంప్ శాపనార్థాలు
టారిఫ్‌లపై ఆయన నిరసనను పరోక్షంగా వ్యక్తీకరించినట్లు పత్రిక పేర్కొంది. గత 25 సంవత్సరాలుగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు స్థిరమైన అభివృద్ధిని గమనించాయి. అయితే, ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే,రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం,భారత్ రష్యాకు చెల్లిస్తున్న నిధులను రష్యా ఉక్రెయిన్‌లో యుద్ధానికి వినియోగిస్తోందని, అందువల్ల ముడి చమురు కొనుగోళ్లు తక్షణమే ఆపాలని ట్రంప్ డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం ట్రంప్ హెచ్చరికలను పక్కన పెట్టడంతో, ప్రతీకార చర్యలుగా అమెరికా 50 శాతం టారిఫ్‌లను అమలు చేసింది.
వివరాలు
రెచ్చగొట్టేలా ట్రంప్ చర్యలు!
భారత్-రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాయంగా మారుతాయంటూ ట్రంప్ శాపనార్థాలు సైతం పెట్టారు. అయితే, ట్రంప్‌కు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్థాయికి చేరుకుంటుందని, కాబట్టి టారిఫ్‌లకు ఒత్తిడికి బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ట్రంప్ తరచుగా భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణలను తాను ఆపేశానని తరచుగా చెప్పుకుంటున్నారు. తాను మధ్యవర్తిత్వం చేయకపోతే ,రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని ఆయన మళ్లీ మళ్లీ చెప్పారు. భారత్‌పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్‌పై దాడులకు తెరదించేలా చేశానని ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను తక్షణమే ఆపడం తన ఘనత అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని: ట్రంప్
అయితే, ఈ వ్యాఖ్యలను భారత్ పలు సార్లు ఖండించింది. అయినప్పటికీ, ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని అంటున్నారు. ఇక పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌లో ఆహ్వానించి ఘనంగా విందు ఇచ్చిన సందర్భాలు, ఆర్థిక మద్దతు ప్రకటించడం వంటి పరిణామాలు భారత ప్రభుత్వానికి అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఈ చర్యలు భారత్‌కి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని, అందుకే ప్రధాని మోదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడటానికి ఇష్టపడట్లేదని విశ్లేషకులు అంటున్నారు.
వివరాలు
మోదీ-చైనా సంబంధాల ప్రాధాన్యం
ఇక ఈ సందర్భంలో, మోదీ ఇటీవల చైనాతో సంబంధాలను ప్రాధాన్యంగా చూసే విధంగా ఉన్నారు. ఈ నెలాఖరులో ఆయన చైనాలో పర్యటన చేపట్టనున్నారు, ఇది మోడీ-ట్రంప్-చైనా మూడు దిశల వాణిజ్య, రాజకీయ పరిణామాల్లో ఒక కీలక అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు.