అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం
అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయి. ఈ క్రమంలో రామ మందిర నిర్మాణంలో భాగంగా మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆలయ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనపై ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోచిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వాన పత్రిక పంపినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వచ్చే ఏడాదిలో జనవరి 15 నుంచి 24 మధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగొచ్చని ట్రస్ట్ నిర్వాకులు పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి షెడ్యూల్ ప్రకారం తేదీని ఖరారు చేయనున్నారు.
జైపూర్‌లో విగ్రహ తయారు
విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తేదీలపై, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. కచ్చితమైన తేదీని ప్రధాని మోదీ నిర్ణయిస్తారని చెప్పారు. అయితే అది జనవరి 15 -24 మధ్యనే ఉంటుందని స్పష్టం చేశారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కొంత సమయం కేటాయించాలని ప్రధాని మోదీకి ట్రస్ట్ నిర్వాహకులు ఈ మేరకు లేఖ రాశారు. ప్రధాని రాకతో ఈ వేడుక ప్రాధాన్యత మరింత పెరుగుతుందని ఆ లేఖలో వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ సర్కార్యవాహ్ సురేశ్ భయ్యా జీ జోషికి కూడా ఆహ్వాన లేఖ పంపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు ఆగస్ట్‌లో జైపూర్ వెళ్లి పార్కోట్‌లో తయారు చేయనున్న విగ్రహాలను ఎంపిక చేయనున్నారు.