
మరోసారి దిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. నోయిడాలో వరద నీటిలో తేలియాడుతున్న వాహనాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీకి జులై నెలలో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మరోసారి హస్తినాను ఎడతెరిపి లేని వర్షాలు ముంచెత్తాయి.
దిల్లీ(DELHI NCR)లో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో వానలు కురిసినట్లు భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ (ORANGE ALERT) జారీ చేసినట్లు స్పష్టం చేసింది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే రాజధాని, సహా పరిసర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర అసౌకర్యం పాలయ్యారు.
మరోవైపు యమునా నదికి ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు నీటి మట్టం 205.45 మీటర్లుగా నమోదైంది.
DETAILS
హిండన్ నది నీటి మట్టంతో వరదలో చిక్కుకున్న వాహనాలు
ఇక ఉత్తరాదిలో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా, ఘజియాబాద్ నగరాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తమై రాకపోకలు స్థంభించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎడతెరిపి లేని వర్షాలతో దేశ రాజధాని దిల్లీకి సరిహద్దున ఉండే ఈ రెండు నగరాలు అతలాకుతలమయ్యాయి.ఈ మేరకు ప్రధాన రహదారులు, కాలనీలను వరద ముంచెత్తింది.
భారీ వర్షాల కారణంగా హిండన్ నది నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో సమీపంలోని ప్రాంతాలన్నీ ముంపు బారిన పడ్డాయి. నది నీటిమట్టం పెరుగుదలతో ఎకోటెక్ 3 సమీపం ప్రాంతాలన్నీ వరదలో చిక్కుకుపోయ్యాయి. ఈ సంఘటనతో వాహనాలు వరదలో తేలియాడుతుండటం గమనార్హం.