బంగాళాఖాతంలో వాయుగుండం.. ఒడిశా వ్యాప్తంగా దంచికొట్టనున్న వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో జులై 30 వరకు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు ఒడిశాలోని గోపాల్‌పూర్ వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్రపీడనంగా మారింది. క్రమంగా వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి చేరువగా ఉందని గుర్తించింది.
సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో దీనికి అనుబంధంగా మరో తుపాను ఆవర్తనం చెందుతున్నట్లు వివరించింది.
ఈ కారణంగానే ఈ నెల 30 వరకు ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. మరోవైపు తీర ప్రాంతంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు చెప్పింది.
సముద్రంలో కెరటాల ఉద్ధృతి ప్రభావంతో గంగపుత్రులు(మత్స్యకారులు) ఎట్టిపరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
DETAILS
రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ
గత 24 గంటల్లో దక్షిణ ఒడిశా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొరాపుట్ జిల్లా కొట్పాడ్‌లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల మేర వానలు కురిసినట్లు గోపాల్‌పూర్(ఒడిశా) వాతావరణ కేంద్రం అధికారి ఉమాశంకర్‌దాస్ పేర్కొన్నారు.
మరోవైపు గజపతి జిల్లా గుసానిలో 6, కాశీనగర్‌లో 5, గంజాం జిల్లా సురడలో 5, పర్లాఖెముండిలో 4, కొంధమాల్ జిల్లా ఖజరియాపదలో 4, మయూర్‌భంజ్ జిల్లా రరునాలో 4, ఇతర కేంద్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందన్నారు.
బుధవారం మల్కాన్‌గిరి, కొరాపుట్, గజపతి, గంజాం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు చెప్పారు.ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశామన్నారు. ప్రఖ్యాత పూరీ, ఖుర్దా, నయాగఢ్, కొంధమాల్, రాయగడ, కలహండి, నవరంగపూర్, మయూర్‌భంజ్ జిల్లాలకు ఎల్లో సూచించామన్నారు.