Mohan Yadav sworn: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్, ఇద్దరు డిప్యూటీలు ప్రమాణస్వీకారం.. ప్రధాని మోదీ హాజరు
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్ కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరాలతో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు మోహన్ యాదవ్ భోపాల్‌లోని ఖత్లాపూర్‌లోని హనుమాన్ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయానికి చేరుకుని పండిట్ దీనదయాళ్, కుషాభౌ ఠాక్రే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
రాష్ట్రంలో 48 శాతం మంది OBCలు.. మోహన్ యాదవ్‌ది అదే కమ్యూనిటీ
మధ్యప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పక్కన పెట్టి బీజేపీ అధిష్టానం సోమవారం మోహన్ యాదవ్‌ను సీఎంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చింది. బీజేపీఎల్పీ సమావేశం సోమవారం జరగ్గా.. చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న యాదవ్‌ను ఎల్పీ నేతగా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మోహన్ యాదవ్‌కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర జనాభాలో 48 శాతానికి పైగా ఉన్న OBC కమ్యూనిటీకి చెందినవారు కావడంతో మోహన్ యాదవ్‌కు కలిసొచ్చింది. మోహన్ యాదవ్ 2013లో తొలిసారిగా ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018, 2023లోనూ అదేస్థానం నుంచి గెలుపొందారు.