PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ
జమ్ముకశ్మీర్‌లో రూ.16,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. బారాముల్లా స్టేషన్ నుంచి లోయలో తొలి ఎలక్ట్రిక్ రైలును కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. జమ్ముకశ్మీర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాం అని అన్నారు. గత కొన్ని ఏళ్లుగా కశ్మీర్ అభివృద్దిని ఎవరూ పట్టించుకోలేదు అని మోదీ ఆరోపించారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుందన్నారు.
220 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
జమ్మూ కశ్మీర్ నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. మోడీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుందన్నారు. అలాగే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ కర్నూలు, ఐఐఎం విశాఖ, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. మొత్తం మీద, 32,000 కోట్ల రూపాయల విలువైన 220 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి మంగళవారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.