PM Modi:మూడు పరమ రుద్ర సూపర్‌కంప్యూటింగ్ సిస్టమ్‌లను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సాంకేతిక ప్రగతి పేదల సాధికారతకు సహాయపడాలని ఉద్ఘాటించారు. ఏ దేశానికి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించేందుకు గొప్ప దార్శనికత అవసరమని ఆయన తెలిపారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద, స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మూడు పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను ఆయన గురువారం, దిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించారు. తన ప్రసంగంలో, సాంకేతిక రంగంలో పరిశోధనలు సాధారణ పౌరులకు ఉపయోగపడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. "జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌ను మేము 2015లో ప్రారంభించాం. ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది, దానివల్ల ఐటీ, తయారీ, ఎంఎస్ఈలతో పాటు అంకుర సంస్థలు కూడా మెరుగవుతున్నాయి," అని ఆయన పేర్కొన్నారు.
మన వాటా టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలి
కచ్చితమైన వాతావరణ సూచనలను అందించేందుకు రూ.850 కోట్ల వ్యయంతో పుణెలో ఏర్పాటు చేసిన హైపర్ ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌లు 'అర్కా', 'అరుణిక'ను కూడా మోదీ ప్రారంభించారు. "శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాలకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మోడీ తెలిపారు.2035కి మన దేశానికి సొంత అంతరిక్ష కేంద్రం అందుబాటులోకి వస్తుంది. ఆ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే ఆమోదం పొందింది. మిషన్ గగన్‌యాన్ సన్నాహాలు మొదలయ్యాయి. 'స్వీయ సాధికారత కోసం సైన్స్' మా మిషన్. ప్రస్తుతం సాంకేతికత, కంప్యూటింగ్ సామర్థ్యాలపై ఆధారపడని రంగం లేదు. ఈ విప్లవంలో మన వాటా బిట్లు, బైట్లలో కాదు, టెరాబైట్లు, పెటాబైట్లలో ఉండాలి." అని ఆయన అన్నారు.
రూ.130 కోట్ల వ్యయంతో..
అంతర్జాతీయ సరఫరా గొలుసులో కీలకమైన పాత్ర పోషించేందుకు మన దేశం సొంత సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించుకుంటోందని ప్రధాని తెలిపారు. ప్రధాని తాజాగా ప్రారంభించిన మూడు సూపర్ కంప్యూటర్లు రూ.130 కోట్ల వ్యయంతో నిర్మించబడ్డాయి. ఇవి అత్యాధునిక పరిశోధనలకు ఉపయోగపడే విధంగా పుణె,దిల్లీ, కోల్‌కతాలో మోహరించబడ్డాయి. ఫాస్ట్ రేడియో బర్‌స్ట్ (ఎఫ్‌ఆర్‌బీ) సహా ఇతర ఖగోళ పరిణామాలను లోతుగా అన్వేషించేందుకు పుణెలోని జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్‌టి) సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగిస్తుంది. మెటీరియల్ సైన్స్,అటామిక్ ఫిజిక్స్‌లో పరిశోధనలను విస్తృతం చేయడంలో దిల్లీలోని ది ఇంటర్ యూనివర్సిటీ యాక్సెలరేటర్ సెంటర్ (ఐయూఏసీ)కు సూపర్ కంప్యూటర్ దోహదపడుతుంది. కోల్‌కతాలోని ఎస్‌ఎన్ బోస్ సెంటర్ భౌతిక, విశ్వోద్భవ,భూవిజ్ఞాన శాస్త్రాల్లో అత్యాధునిక పరిశోధనల కోసం సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగించుకుంటుంది.