PM Modi : పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు బయలుదేరారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవం సందర్భంగా గత 45 ఏళ్లలో పోలాండ్ లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. పోలాండ్‌ను సందర్శించిన చివరి భారత ప్రధానిమొరార్జీ దేశాయ్(1979). ఆగస్ట్ 21-22 వరకు పోలాండ్‌లో ఉన్న సమయంలో, ప్రధాని మోదీ రాష్ట్ర నాయకులతో విస్తృత శ్రేణి అంశాలపై చర్చిస్తారని భావిస్తున్నారు.
వార్సాలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
ప్రధాని మోదీ వార్సాలో జరిగే కార్యక్రమంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి పర్యటనకు ముందు, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) భారతదేశం, పోలాండ్ మధ్య చారిత్రక సంబంధాలను నొక్కిచెప్పింది. ఆపరేషన్ గంగా 2022 సమయంలో ఉక్రెయిన్ నుండి 4,000 మంది భారతీయ విద్యార్థులను తరలించినప్పుడు పోలాండ్ సహాయాన్ని పేర్కొంది. MEA ప్రకటన రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 6,000 మందికి పైగా పోలిష్ మహిళలు, పిల్లలకు ఆశ్రయంగా భారతదేశం పోషించిన పాత్రను గుర్తుచేసింది.
పోలాండ్ కీలక ఆర్థిక భాగస్వామి: ప్రధాని మోదీ
పోలాండ్ పర్యటనకు ముందు, భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. 'పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయి. సెంట్రల్ యూరోప్‌లో పోలాండ్ కీలకమైన ఆర్థిక భాగస్వామి. ప్రజాస్వామ్యం, బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఇది ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తుంది' అని మోడీ రాసుకొచ్చారు.
జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ కు..
పోలాండ్ నుంచి ఆగస్టు 23న విలాసవంతమైన 'ట్రైన్ ఫోర్స్ వన్'లో మోడీ ఉక్రెయిన్‌కు వెళతారు. జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని ఉక్రెయిన్ వెళ్తున్నారు.భారత ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ప్రధాని తెలిపారు. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ ఉక్రెయిన్ లో పర్యటించడం విశేషం.