
మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టనున్నారు. అక్టోబర్ తొలి వారంలోని 2,3,4 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ బహిరంగ సభల్లో మోదీ పాల్గొననున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రోడ్ షో నిర్వహించేందుకు కషాయ దళం ప్లాన్ చేస్తోంది.
ఎన్నికల వేళ తెలంగాణలో మోదీ సభలు, కమళనాథులకు మైలేజీ తీసుకురానుంది. త్వరలోనే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడనుంది.
ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు తెలంగాణలో పర్యటిస్తూ క్యాడర్ లో ఉత్సాహం నింపారు.
details
ఆరు గ్యారెంటీలను ప్రకటించి వేడి పుట్టించిన కాంగ్రెస్
మరోవైపు జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవం పేరిట బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాలను చుట్టేస్తున్నారు.
శనివారం పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి మరింత వేడిని రాజేశారు. దీంతో జాతీయ పార్టీలు దూకుడు పెంచాయి.
ఇప్పటికే సెప్టెంబర్ 16, 17న రెండు రోజులు హైదరాబాద్ నగరంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం బస చేసింది. ఎలాగైనా తెలంగాణ గడ్డ మీద చేతి గుర్తును అధికారంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రెఢీ చేసింది.
రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి పేరుతో భారీ బహిరంగ సభను విజయవంతం చేశారు. ఆరు గ్యారెంటీలను ప్రకటించి తెలంగాణ రాజకీయంలో వేడి సెగలను రాజేశారు.
ఈ మేరకు తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.