
PM Modi: మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13వ తేదీన మణిపూర్,మిజోరంలలో పర్యటన చేయనున్నారు. తొలుత మోదీ మిజోరంను సందర్శిస్తారని ఐజ్వాల్‌లోని అధికారులు తెలిపారు. ముఖ్యంగా బైరాబి-సైరంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించడానికి ప్రధాని మోడీ మిజోరం వెళతారు. 2023 మేలో మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ దేశవ్యాప్తంగా చర్చకు లోనైంది. ఆఘర్షణ ప్రభావం కారణంగా ప్రధాని మోదీపై రాజకీయ విమర్శలు ఎదురయ్యాయి.విపక్షాలు ఎందుకు ప్రధాని మణిపూర్‌కు వెళ్లడం లేదు అని ప్రశ్నించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం,మిజోరం,మణిపూర్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనకు అవకాశాలు ఉన్నట్లు ఐజ్వాల్ అధికారులు తెలిపారు. అయితే,పర్యటనకు సంబంధించిన తుది షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు.ఇంపాల్‌లోని అధికారులు కూడా మోదీ టూర్ గురించి ఎటువంటి కాంక్రీట్ కంఫర్మేషన్ ఇవ్వలేదు.
వివరాలు
యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా 51.38 కిలోమీటర్ల పొడువైన రైల్వే లైన్
మిజోరం చీఫ్ సెక్రటరీ ఖిల్లి రామ్ మీనా వివిధ శాఖల అధికారులు, స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని రాక కోసం భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రిసెప్షన్, వీధి అలంకరణ వంటి అంశాలను సమీక్షించారు. ఐజ్వాల్ సమీపంలోని లామౌల్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "యాక్ట్ ఈస్ట్" పాలసీ ప్రకారం, 51.38 కిలోమీటర్ల పొడవు కలిగిన కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టబడింది. కొత్త రైల్వే లైన్ అస్సాం రాష్ట్రంలోని సిల్చార్ పట్టణం నుండి ఐజ్వాల్ వరకు నేరుగా కలుస్తుంది.