
Pm Modi: వచ్చే నెలలో ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశం.. చైనాలో పర్యటించనున్న ప్రధాని మోదీ..
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే నెలలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో తియాంజిన్ నగరంలో నిర్వహించనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో మోడీ పాల్గొననున్నారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సదస్సులో మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సహా ఇతర దేశాల నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
వివరాలు
షీ జిన్‌పింగ్'తో మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించే అవకాశం
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, భారత్-చైనా మధ్య బలహీనమైన దౌత్య సంబంధాలను మళ్లీ పునరుద్ధరించేందుకు ఇరుదేశాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మోడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping)తో మోడీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గత సంవత్సరం అక్టోబరులో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా కలిసిన విషయం కూడా గుర్తుండాలి.
వివరాలు
ఇప్పటివరకు చైనాలో ఐదుసార్లు పర్యటించిన మోదీ
మోడీ 2015లో ప్రధాని అయ్యాక తొలిసారి చైనా రాజధాని బీజింగ్‌ను సందర్శించారు. ఇప్పటివరకు ఆయన ఐదుసార్లు చైనాలో పర్యటించారు. అయితే, 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణతో ఇరు దేశాల సంబంధాలు ప్రతికూలంగా మారాయి. వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.