Modi on deepfake: అతిపెద్ద సవాల్గా డీప్‌ఫేక్ వీడియోలు.. గర్బా వీడియోపై ప్రధాని మోదీ
భారతదేశంలో గత కొంత కాలంగా రెచ్చిపోతున్న డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియోలు భారత వ్యవస్థకు పెను ముప్పుగా మారాయన్నారు.అటువంటి పోకడలు సమాజంలో గందరగోళానికి దారి తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే తెలిసిన వాళ్లు నాకో వైరల్ వీడియో పంపించారన్న మోదీ,అందులో తాను పాట పాడుతున్నట్టుగా ఉందన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారని మోదీ చెప్పారు.ఇదో సమస్యాత్మకమైన అంశమని ఆయన అభివర్ణించారు. డీప్ ఫేక్ వీడియోల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న మోదీ, వీటిపై మీడియా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఇటువంటి పోకడలపై ప్రజలను జాగృతం చేయాలన్న మోదీ
ఓ వైపు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా మరోవైపు సవాళ్లు ఎదురవడంపై ప్రజలను సన్నద్ధం చేయాలన్నారు. వైరల్ అవుతున్నడీప్ ఫేక్ వీడియోలను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరికలు పంపాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరామన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్లు, సినీ తారలపై అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. మరొకరి ముఖాల స్థానంలో రష్మిక మందన్న, కాజోల్ వంటి తారల ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్టింట వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఉండటంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. మరోవైపు ప్రధాని మోదీ ఓ పాట పాడినట్టు డీప్ ఫేక్ వీడియో ఇటీవలే వైరల్ గా మారింది.ఇటువంటి వీడియోలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.