
Modi-Ajit Doval: మరోసారి ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ దాడికి భారత్ ఖచ్చితంగా కౌంటర్ చర్యలు తీసుకోనుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో, మంగళవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు.
దేశంలోని భద్రతా పరిస్థితులు, భవిష్య కార్యాచరణపై వారిద్దరూ చర్చించినట్లు సమాచారం.
48 గంటల వ్యవధిలో వీరిద్దరి మధ్య ఇది రెండో భేటీ కావడం గమనార్హం.
ఇక మరోవైపు, కేంద్ర హోంశాఖ కూడా జాగ్రత్త చర్యలపై దృష్టిసారించింది.
వివరాలు
హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో సమావేశం
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలన్నదానిపై అవగాహన కల్పించేందుకు మే 7న, బుధవారం అన్ని రాష్ట్రాల్లో,కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోని సమావేశాన్ని హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
పహల్గాం దాడికి పాల్పడి తప్పిదం చేసినవారు, లేదా ఆ కుట్రలో భాగస్వాములైనవారికి చావు దెబ్బ తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు.
ఈ ప్రకటనల నేపథ్యంలో,చర్యలు తీవ్రతరంగా ఉండేలా కనిపిస్తున్నాయి.
రేపు నిర్వహించబోయే మాక్ డ్రిల్లుల్లో ప్రభుత్వ అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్‌సీసీ/ఎన్‌ఎస్‌ఎస్ సభ్యులు, నెహ్రూ యువకేంద్ర ప్రతినిధులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొననున్నారు.
వివరాలు
భారత్ పాకిస్థాన్‌పై కఠిన చర్యలు
శత్రుదాడి సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా స్పందించాలో వారికి అవగాహన కల్పించేందుకు ఈ డ్రిల్లులు నిర్వహించబోతున్నారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం, భారత్ పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు పాల్పడుతోంది.
ఇందులో భాగంగా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అంతేగాక, పాకిస్థాన్‌తో వాణిజ్యం, రాకపోకలను నిషేధించింది.
దేశ గగనతలాన్ని కూడా మూసివేసింది. త్రివిధ దళాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితికైనా సిద్ధంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
వివరాలు
పాకిస్థాన్ నిర్వహించిన క్షిపణి పరీక్షలపై ప్రశ్నలు
దీనికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యంతో అంతర్జాతీయ వేదికల్లో భారత్‌పై విమర్శలు చేస్తోంది.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో నేడు ఒక క్లోజ్డ్‌డోర్ సమావేశం జరిగింది.
పాకిస్థాన్ తన సభ్యత్వాన్ని వాడుకొని భారత్‌ను వ్యతిరేకించే తీర్మానాన్ని ఆమోదింపజేయాలని యత్నించింది.
అయితే, ఈ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. అంతేగాక, ఇస్లామాబాద్ తరచూ చేస్తున్న అణు బెదిరింపులపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇటీవల పాకిస్థాన్ నిర్వహించిన క్షిపణి పరీక్షలపై కూడా కొన్ని దేశాలు ప్రశ్నలు ఎత్తాయి.