PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పరీక్షలకు సిద్ధమవుతున్నయువకుల కోసం ఒత్తిడి లేని వాతావరణాన్నిసృష్టించే కార్యక్రమం ఏడవ ఎడిషన్ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాఠశాల విద్యార్థులతో సంభాషించారు. ఈసందర్భంగా పిల్లలకు ప్రధాని పలు సలహాలు,సూచనలిచ్చారు.పరీక్షల సమయంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదన్నారు. ఎదుగుదలకు పోటీ చాలా ముఖ్యం.అయితే స్నేహితుల మధ్య ఈ పోటీ ఆరోగ్యకరమైనదిగా ఉండాలని మోదీ అన్నారు. కుటుంబ పరిస్థితులలో తరచుగా అనారోగ్యకరమైన పోటీ బీజాలు నాటడం వల్ల తోబుట్టువుల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడుతుందని ఆయన సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చవద్దని కోరారు.తమ పిల్లలు సాధించిన విజయాలను వారి విజిటింగ్ కార్డ్‌గా చేసుకోవద్దని కూడా ఆయన కోరారు.
పరీక్షలలో ముందుగానే ప్రశ్నపత్రాన్ని చదవాలి: మోదీ
విద్యార్థులను ప్రేరేపించడంలో ఉపాధ్యాయుల పాత్రపై దృష్టి సారించిన ప్రధాన మంత్రి, ఒక తరగతికి మాత్రమే కాకుండా మొత్తం పాఠశాలకు చెందిన విద్యార్థుల ఒత్తిడిని తగ్గించే సామర్థ్యం వారికే ఉందని నొక్కి చెప్పారు. ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంట్రీతో విద్యార్థులు ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్తారని అన్నారు. కొత్త బట్టలు, ఆచారాలు లేదా స్టేషనరీలతో పరీక్ష రోజును అతిగా హైప్ చేయవద్దని ఆయన తల్లిదండ్రులను కోరారు. ఆఖరి క్షణంలో భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు ప్రశ్నపత్రాన్ని చదవాలని, సమయ కేటాయింపుతో ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రధాని వారికి సూచించారు.
కొవిడ్ సమయంలో ఆన్‌లైన్‌లో 'పరీక్షా పే చర్చ'
ఇప్పటికీ చాలా వరకు పరీక్షలు రాస్తున్నారని, కంప్యూటర్లు, ఫోన్ల వల్ల రాసే అలవాటు తగ్గుతోందని విద్యార్థులకు ప్రధాని గుర్తు చేశారు. రాయడం అలవాటు చేసుకోవాలని కోరారు. చదివే/చదువుకునే సమయంలో 50 శాతం రాయడానికి కేటాయించాలని కోరారు. మీరు ఏదైనా వ్రాసినప్పుడు మాత్రమే మీరు దానిని నిజంగా అర్థం చేసుకుంటారని, ఇతర విద్యార్థుల వేగాన్ని చూసి భయపడవద్దని వారిని కోరారు. ప్రధాని మోదీ ఈ 'పరీక్షా పే చర్చ' కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. కొవిడ్ సమయంలో నాలుగో ఎడిషన్ మాత్రం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ప్రతి ఏడాది ఈ ప్రోగ్రామ్‌కు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సంవత్సరం 2.26 కోట్ల మంది విద్యార్థులు దీనికి నమోదు చేసుకున్నారు.