ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023 నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజనను ప్రస్తావించిన మోదీ తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో రక్తం ఏరులై పారిందని(విద్యార్థుల ఆత్మబలిదానాలు) మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన రెండు రాష్ట్రాలను సంతృప్తిపరచలేకపోయిందన్నారు. తెలంగాణ వాసులకు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, సంబురాలు చేసుకోలేకపోయిందన్నారు. ఎన్డీఏ హయాంలో ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ విభజనలు జరిగాయని, వాటిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాసులు అసంతృప్తికి గురయ్యారని మోదీ అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ భవనంలోనే జరిగింది : మోదీ
నేటి నుంచి 5రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతాయి. నేడు పార్లమెంట్ పాత భవనంలోనే సమావేశాలు జరుగుతున్నాయి. మంగళవారం నుంచి సభా వ్యవహారాలు కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రస్తావించారు. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ క్రమంలోనే పాత భవనంలో పలు జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు.ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్నీ సైతం ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ భవనంలోనే జరిగిందన్నారు. బీజేపీ హయాంలో చేసిన మూడు రాష్ట్రాల విభజనలో అన్ని చోట్లా సంబరాలు జరిగితే ఏపీ విభజన మాత్రం సరిగ్గా జరగక ఇరు రాష్ట్రాలు అసంతృప్తికి గురయ్యాయన్నారు.