Modi Ayodhya Visit: నేడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రారంభిచనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్త విమానాశ్రయంతో పాటు, అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. మొత్తం రూ.15,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను మోదీ చేయనున్నారు. దేశంలోని వివిధ నరగారాలకు కనెక్ట్ అయ్యే ఆరు వందే భారత్, రెండు అమృత్ భారత్ రైళ్లను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఉదయం 11.15 గంటలకు రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15గంటలకు కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
అయోధ్య వారసత్వాన్ని సంరక్షించడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి శ్రీరాముడి నగరమైన అయోధ్య వారసత్వాన్ని సంరక్షించడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ క్రమంలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను తాను అయోధ్యలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే దేశంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేసే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నటుల మోదీ చెప్పారు.