
Vande Bharat: కశ్మీర్ లోయలో తొలిసారి అందుబాటులోకి 'వందేభారత్'.. 38 సొరంగాలు.. 927 వంతెనలు
ఈ వార్తాకథనం ఏంటి
కశ్మీర్ లోయ (Kashmir Valley)లో తొలిసారిగా వందేభారత్ (Vande Bharat) రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఏప్రిల్ 19న తొలి వందేభారత్ రైలు కాట్రా నుండి కశ్మీర్ వరకు పరుగెత్తనుంది.
ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మధ్య 272 కి.మీ. మేర ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైలు లింక్ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ రైలును అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఏప్రిల్ 19న ప్రధాని మోదీ ఉదంపుర్‌కు చేరుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను సందర్శించి ప్రారంభిస్తారని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
అనంతరం కాట్రా నుండి వందేభారత్ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
వివరాలు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తొలుత కాట్రా నుండి ప్రారంభం
ప్రస్తుతం జమ్మూ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తొలుత కాట్రా నుండి ప్రారంభం కానుంది.
ఈ రైలు లింక్ ప్రాజెక్టు గత నెలలోనే పూర్తయ్యిందని, ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించగా, రైల్వే సేఫ్టీ కమిషన్ సర్వీసుల ప్రారంభానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ రైలు ప్రారంభంతో, కశ్మీర్‌కు నేరుగా రైలు కనెక్షన్ కల్పించాలన్న చిరకాల ఆకాంక్ష నెరవేరనుంది.
ప్రస్తుతం కశ్మీర్ లోయలోని సంగల్డాన్-బారాముల్లా మధ్య, అలాగే కాట్రా నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాత్రమే రైల్వే సదుపాయం ఉంది.
కశ్మీర్‌ను రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైనప్పటికీ, అనేక భౌగోళిక,వాతావరణ పరిమితుల కారణంగా జాప్యం ఎదురైంది.
వివరాలు
ఈ ప్రాజెక్టులో 927 వంతెనలు
మొత్తం 119 కి.మీ. పొడవు గల ఈ ప్రాజెక్టులో 38 సొరంగాలు ఉండగా, వీటిలో 12.75 కి.మీ. పొడవైన టీ-49 సొరంగం అతిపెద్దది.
అలాగే, ఈ ప్రాజెక్టులో 927 వంతెనలు ఉండగా, అందులో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన (Chenab Rail Bridge) కూడా ఉంది.
దీని ఎత్తు 359 మీటర్లు కాగా, పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే 35 మీటర్లు అధికంగా ఉంటుంది.