
New Flats for MPs : నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన నూతన నివాస గృహ సముదాయాన్ని ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు,దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో నిర్మించిన 184 టైప్-7మల్టీ స్టోరీ ఫ్లాట్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా,ఎంపీల నివాస సముదాయంలో మోదీ 'సిందూర' మొక్కను నాటి, అనంతరం నిర్మాణ పనుల్లో పాల్గొన్న శ్రమజీవులతో కాసేపు ముచ్చటిస్తారు. తరువాత సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త ఎంపీ గృహ సముదాయం,పార్లమెంట్ సభ్యుల అవసరాలకు తగ్గట్టుగా అన్ని ఆధునిక సౌకర్యాలతో రూపకల్పన చేయబడింది. ప్రతి ఫ్లాట్ సుమారు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి,నివాసానికి తోడు అధికారిక పనులకు అనుకూలమైన గదులు కూడా కల్పించారు.
వివరాలు
గ్రీహా 3 స్టార్ రేటింగ్ పొందేలా,నేషనల్ బిల్డింగ్ కోడ్-2016 ప్రమాణాలు
అదనంగా, సిబ్బంది నివాసాలు,కార్యాలయాలు,కమ్యూనిటీ సెంటర్ వంటి సౌకర్యాలను సముదాయంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు వెల్లడించారు. పర్యావరణ హిత సాంకేతికతతో నిర్మాణం చేపట్టి,గ్రీహా 3 స్టార్ రేటింగ్ పొందేలా,నేషనల్ బిల్డింగ్ కోడ్-2016 ప్రమాణాలను అనుసరించారు. దీని ద్వారా శక్తి పొదుపు, పునరుత్పత్తి ఇంధన వనరుల వినియోగం, వ్యర్థాల సమర్థ నిర్వహణలో మెరుగులు సాధించవచ్చని అధికారులు తెలిపారు. అల్యూమినియం షట్టరింగ్ విధానంలో మోనోలితిక్ కాంక్రీట్ సాంకేతికతను ఉపయోగించడం వల్ల పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ భవనాలు భూకంప నిరోధకంగా, దివ్యాంగులకు సౌకర్యవంతంగా ఉండేలా రూపకల్పన చేయబడ్డాయి. ప్రాజెక్ట్ కోసం భూమి పరిమితంగా ఉండటంతో, అపార్ట్‌మెంట్ తరహా గృహాలను నిర్మించడం జరిగింది.