LOADING...
PM Modi: కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పార్లమెంట్‌లో నేడు 'వందేమాతరం'పై చర్చ  
పార్లమెంట్‌లో నేడు 'వందేమాతరం'పై చర్చ

PM Modi: కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పార్లమెంట్‌లో నేడు 'వందేమాతరం'పై చర్చ  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్‌ 1న ప్రారంభమైన ఈ సమావేశాలు డిసెంబర్‌ 19 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ 'వందేమాతరం' గీతం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లో ఈ చర్చ మొదలుకానుంది. ఈ సందర్భంగా 'వందేమాతరం'తో సంబంధం ఉన్న అనేక చారిత్రక అంశాలు, ముఖ్యమైన విషయాలను ప్రధాని ప్రస్తావించనున్నారని సమాచారం. ఇదే నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 1937లో వందేమాతరం గీతంలోని కీలక చరణాలను తొలగించడం ద్వారా దేశ విభజనకు బీజం వేశారని ఆయన ఆరోపించారు. తాజాగా మరోసారి లోక్‌సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వివరాలు 

రాజ్యసభలో చర్చను ప్రారంభించనున్న అమిత్ షా 

పార్లమెంట్‌లో 'వందేమాతరం'పై మొత్తం 10 గంటల పాటు చర్చ నిర్వహించేందుకు నిర్ణయించారు. ప్రధాని ప్రసంగం అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. తర్వాత గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీతో పాటు మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. రాజ్యసభలో ఈ చర్చను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు తెలిపారు. 'వందేమాతరం' గీతాన్ని ప్రముఖ రచయిత బంకింం చంద్ర ఛటర్జీ రచించారు. ఈ గీతం తొలిసారిగా న‌వంబర్‌ 7, 1875న బంగదర్శన్ పత్రికలో ప్రచురితమైంది. 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమ సమయంలో ఈ గీతం రాజకీయంగా విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది.

వివరాలు 

 పార్లమెంట్‌లో 'SIR' అంశంపై విపక్షాల ఆందోళనలు 

అనంతరం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపుతూ సమరయోధులను ఏకం చేసే శక్తివంతమైన గీతంగా మారింది. చివరకు 1950 జనవరి 24న ఈ గీతాన్ని జాతీయ గీతంగా అధికారికంగా గుర్తించారు. ఇటీవలే కేంద్రప్రభుత్వం వందేమాతరం 150వవార్షికోత్సవ వేడుకలను నిర్వహించింది. ఏడాదిపొడవునా ఈ వార్షికోత్సవ కార్యక్రమాలను కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్‌లో 'SIR' అంశంపై విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్ష ఎంపీలు సభలో నిరసనలు తెలుపుతూ తక్షణమే 'SIR'ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే 'వందేమాతరం'పై ప్రత్యేక చర్చ ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో చర్చ నిరాఘాటంగా కొనసాగుతుందా? లేక విపక్ష నిరసనలు మరింత ఉధృతమై సభా కార్యకలాపాలు అంతరాయం కలిగిస్తాయా?అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Advertisement