PM Modi: పుతిన్ ఆహ్వానం.. మరోసారి రష్యాకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ఈనెల 22 నుంచి 23 తేదీల్లో కజాన్ వేదికగా జరగబోయే 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ బ్రిక్స్ సభ్య దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే, ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయని తెలిపారు. బ్రిక్స్ ప్రారంభించిన పలు కార్యక్రమాల పురోగతిని సమీక్షించడం, భవిష్యత్ సహకారం కోసం అనేక విషయాలపై చర్చ జరపడం ఈ సమావేశంలో ప్రాధాన్యతగా ఉండనుంది.
2006లో బ్రిక్ గ్రూపు ప్రారంభం
ఇది నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి రష్యా పర్యటన. 2024 జులైలో కూడా మోదీ రష్యాలో పర్యటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత, ప్రధాని మోదీ మాస్కోలో తన తొలి పర్యటన చేశారు. ఆ సమయంలో ఆయన 22వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా, రష్యాలో ఉన్న భారత సంతతి ప్రజలతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2006లో బ్రెజిల్, రష్యా,ఇండియా,చైనా దేశాలు కలిసి బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత దీనిని బ్రిక్స్‌గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా ఈ గ్రూపులో చేరాయి. ప్రస్తుతం ఈ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి.