Delhi-Meerut RRTS: అక్టోబర్ 20న ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రైలు సర్వీస్ రాపిడ్‌ఎక్స్‌ను శుక్రవారం (అక్టోబర్ 20) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దిల్లీ-ఘజియాబాద్-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్‌టీఎస్) మొదటి విడతగా దుహై నుంచి సాహిబాబాద్ మధ్య 17కిలోమీటర్ల వరకు ప్రారంభించనున్నారు. దిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఫేజ్ 1లో ప్రణాళిక చేయచేసిన మూడు ప్రాధాన్య కారిడార్లలో ఇది మొదటిది. దిల్లీ-మీరట్ కారిడార్ మొత్తం పొడవు 82 కిలోమీటర్లు ఉంటుంది. ఒక గంటలో ఈ మొత్తం గమ్యాన్ని చేరుకోవచ్చు. మొదటి దశలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపోలను ఈ రైలు కవర్ చేస్తుంది. ఎంఎంటీఎస్ తరహాలో దిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య ప్రయాణం కోసం అధునాతన ఆర్ఆర్‌టీఎస్ రైళ్లను తీసుకొస్తున్నారు.
రూ. 30,274 కోట్లతో ప్రాజెక్టు
ఈ మొత్తం ప్రాజెక్టును రూ. 30,274 కోట్లతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుంచి నిధులు కూడా అందాయి. ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ద్వారా భారత ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సర్కార్లు జాయింట్ వెంచర్‌గా చేపడుతున్నాయి. రాపిడ్‌ఎక్స్ రైలు మెట్రో రైళ్లను పోలి ఉంటుంది. అయితే రైలు ఫీచర్లు మాత్రం మెట్రో మాదిరిగా ఉండవని, పూర్తిగా చాలా డిఫరెంట్‌గా ఉంటుందని ఎన్‌సీఆర్టీసీ పేర్కొంది.
ఈ రైళ్లలో అధునాత ఫీచర్లు
రాపిడ్‌ఎక్స్ రైళ్లలో విశాలమైన సీట్లు, ఎక్కువ లెగ్‌రూమ్, కోట్ హ్యాంగర్‌లతో కూడిన ప్రీమియం-క్లాస్ కార్లు ఉంటాయి. రైళ్లలో లగేజీ క్యారియర్లు, మినీ స్క్రీన్‌లు, వై-ఫై, మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సౌకర్యం వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ రైళ్లు 180km/h వేగంతో నడుస్తాయి. ఇది భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థగా మారనుంది. ఒక్కో రైలులో 407 సీట్లు ఉంటాయి. ఈ రైళ్లు కేవలం ఒక గంటలో 100 కిలోమీటర్లు ప్రయాణించగలవు. అయితే మెట్రో రైలుకు 100 కిలోమీటర్లు మూడు గంటల సమయం పడుతుంది.