India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్ ఇండియా మొబైల్స్ .. డబ్ల్యూటీఎస్‌ఏ ఈవెంట్‌లో ప్రధాని మోదీ
దిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫోన్ల తయారీ అంశంపై మాట్లాడిన ఆయన, సెమీకండక్టర్ విభాగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, త్వరలోనే పూర్తిగా మేడిన్ ఇండియా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దేశంలో మొబైల్ తయారీ యూనిట్లు వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి
''2014లో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 200కి చేరుకుంది. ఇంతకుముందు ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండేది. ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువ మొబైల్స్‌ను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచ దేశాలకు మేడిన్ ఇండియా మొబైల్స్ అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. సెమీకండక్టర్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం'' అని ప్రధాని మోదీ తెలిపారు. అదే విధంగా, ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆయన వివరించారు. సాంకేతికత వినియోగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మోదీ గుర్తుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మంచి మార్గంలో ఉపయోగించుకోవాలని ప్రజలకు హితవు చెప్పారు.