కాన్వాయ్ ని కాదని దిల్లీ మెట్రోలో మోదీ ప్రయాణం.. దిల్లీ వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు
దిల్లీ మెట్రో రైల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించారు. దిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే కాన్వాయ్ ని పక్కన పెట్టి మెట్రో రైల్లో యూనివర్శిటీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా రైలు బోగీలోని పలువురు విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. మోదీ రాక నేపథ్యంలో దిల్లీ యూనివర్శిటీ మేనేజ్ మెంట్ ముందస్తుగానే విద్యార్థులకు గైడ్ లైన్స్ జారీ చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించి రాకూడదని సూచించింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య క్లాసులను రద్దు చేస్తున్నామని స్పష్టం చేసింది.
గతేడాది మే 1న ప్రారంభమైన శతాబ్ది ఉత్సవాలు
దిల్లీ యూనివర్సిటీకి సాధారణ భారత పౌరుడిగా మెట్రో రైల్లో ప్రయాణించిన మోదీ, తోటి ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం మోదీ మెట్రో రైలులో వెళ్తున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో మోదీ మెట్రో రైల్ ఫొటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. 1922లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టం ప్రకారం దిల్లీ వర్సిటీని ఏర్పాటు చేశారు. దీన్ని యూజీసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా గుర్తించింది. 2022 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వర్సిటీ, గతేడాది మే 1న శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించింది.