గ్రేట్ ఫ్రెండ్ మోదీకి రష్యా అధ్యక్షుడి ప్రశంసలు..మేకిన్ ఇండియా ఫలితాలు కనిపిస్తున్నాయని కితాబు
భారతదేశంపై చిరకాల మిత్రదేశం రష్యా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు గతంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా పథకాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మెచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మేకిన్ ఇండియా విధానాలను పుతిన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్‌లో తయారీ అంటూ తీసుకున్న నిర్ణయం తాలూకు సత్ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని పుతిన్ చెప్పారు. రష్యాకు గొప్ప స్నేహితుడు అయిన ప్రధాని మోదీ, కొన్నాళ్ల క్రితం మేకిన్ ఇండియాను రూపొందించారని మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా అన్నారు.
భారత్ రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దృఢం: రష్యా
మేకిన్ ఇండియా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో దాని ఫలితాలు స్పష్టంగా తెలుస్తున్నాయని పుతిన్ అన్నారు. మనం చేసింది కాకపోయినా, మన మిత్రుడు చేసిన కార్యం సత్ఫలితాలిస్తుంటే అనుసరించడం తప్పేమీ కాదని ఈ సందర్భంగా పుతిన్ చెప్పుకొచ్చారు. రష్యా ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారత్‌ను ఉదహరించారు. భారత్ రష్యాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దృఢంగా మారుతుందని గతంలో రష్యా అంబాసిడర్ గా పనిచేసిన డెనిస్ అలిపోవ్ తెలిపారు. నిత్యం రష్యా గురించి అంతర్జాతీయ స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్న అలిపోవ్, భారత్ రష్యాల బంధాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారన్నారు. అయితే నిజం ఏమిటంటే ఈ రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతూనే ఉంటుందన్నారు.